Asia Cup 2025: సూర్య క్రీడా స్ఫూర్తికి హ్యాట్సాఫ్.. అంపైర్ ఔటిచ్చినా వెనక్కి పిలిచాడు

Asia Cup 2025: సూర్య క్రీడా స్ఫూర్తికి హ్యాట్సాఫ్.. అంపైర్ ఔటిచ్చినా వెనక్కి పిలిచాడు

ఆసియా కప్ లో భాగంగా యూఏఈ తో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చూపించిన క్రీడా స్ఫూర్తి ఆకట్టుకుంటుంది. బుధవారం (సెప్టెంబర్ 10) దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో యూఏఈ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 13 ఓవర్ మూడో బంతిని శివమ్ దూబే జునైద్ సిద్ధిక్ కి బౌన్సర్ వేశాడు. ఈ షార్ట్ బాల్ ని  ఆడడంలో సిద్ధిక్ విఫలం కావడంతో బంతి వికెట్ కీపర్ సంజు శాంసన్ చేతిలో పడింది. అప్పటికే క్రీజ్ దాటిన సిద్ధిక్ ను గమనించిన శాంసన్ బంతిని స్టంప్స్ కు విసిరాడు. 

బాల్ స్టంప్స్ కు తగలడంతో స్టంపౌట్ కు టీమిండియా అప్పీల్ చేసింది. రీప్లేలో శాంసన్ బాల్ ను వికెట్లకు కొట్టే సమయానికి యూఏఈ ప్లేయర్ క్రీజ్ బయట ఉన్నాడు. రీప్లే చూసి థర్డ్ అంపైర్ సిద్ధిక్ ని ఔట్ గా ప్రకటించాడు. అయితే సూర్య ఆ తర్వాత అంపైర్ తో చర్చించి తన అప్పీల్ ను వెనక్కి తీసుకున్నాడు. అసలు విషయం ఏంటంటే దూబే బాల్ రిలీజ్ చేయకముందే అతని వెనక జేబులో నుంచి టవల్ జారీ కింద పడింది. బాల్ వేసిన తర్వాత టవల్ చూపిస్తూ సిద్ధిక్ అలాగే ఉండిపోయాడు. ఈ క్రమంలో ఏదో పరధ్యానంలో ఉండి క్రీజ్ బయటే నించున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన అప్పీల్ వెనక్కి తీసుకొని సిద్ధిక్ ని బ్యాటింగ్ కు పిలిచాడు. 

►ALSO READ | Asia Cup 2025: బోణీ అదిరింది.. యూఏఈని చిత్తుచిత్తుగా ఓడించిన టీమిండియా

ఆ తర్వాత బంతికే దూబే బౌలింగ్ లో సూర్యకు క్యాచ్ ఇచ్చి సిద్ధిక్ ఔటవ్వడం విశేషం. సూర్య చూపించిన ఈ క్రీడా స్ఫూర్తికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే యూఏఈపై టీమిండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఇండియా 4.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. నాలుగు వికెట్లు పడగొట్టిన కుల్దీప్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.