యూజీడీ పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం

యూజీడీ పనుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్ ఆగ్రహం
  • యుద్ధప్రాతిపదికన రోడ్ల పునరుద్ధరణకు ఆదేశం

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనుల నిర్వహణ తీరుపై సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో ప్రజారోగ్య శాఖ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణంలో యూజీడీ పనులు నిర్లక్ష్యంగా సాగుతున్నాయని మండిపడ్డారు.

పైపులు, మ్యాన్‌‌హోల్‌‌ల నిర్మాణం కోసం రోడ్లను తవ్వేసి, నెలల తరబడి  రిపేరు చేయకుండా వదిలేయడం వల్ల ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ట్రాఫిక్‌‌కు అంతరాయం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాల సమయంలో దెబ్బతిన్న తాగునీటి పైపులైన్లు, ఇతర ప్రజా వినియోగ సదుపాయాలను సకాలంలో పునరుద్ధరించకపోవడం వల్లే ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోందన్నారు.

పనుల్లో వేగం పెంచి, యూజీడీ పనులు చేపట్టిన అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల పునరుద్ధరణకు సంబంధించి టైం లైన్‌‌తో కూడిన యాక్షన్ ప్లాన్‌‌ను వెంటనే సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య శాఖ, కాంట్రాక్ట్ ఏజెన్సీ సమన్వయంతో పనిచేసి దెబ్బతిన్న మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని, దీనిని మున్సిపల్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సమావేశంలో నల్గొండ ప్రజారోగ్య శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ హనుమంత్ రెడ్డి, మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిరణ్ కుమార్ పాల్గొన్నారు.