సూర్యాపేట, వెలుగు: నెల రోజులుగా తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదని సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యనగర్ వాసులు వాపోయారు. సూర్యాపేట–దంతాలపల్లి రహదారిపై ఖాళీ బిందెలతో బుధవారం ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. నెల రోజులుగా తమ ఇండ్లకు మంచినీళ్లు రావడం లేదని, దీంతో తాగడానికి, కనీస అవసరాలు తీర్చుకునేందుకు ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.
అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేసినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న మహిళలను చెదరగొట్టారు.

