- గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో లక్ష్మీనర్సింహుడిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
సూర్యాపేట, వెలుగు : వ్యవసాయం చేయడం కూడా విజ్ఞానం పెంచుకోవడంతో సమానం అని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం అందజేశారు.
అనంతరం ఆలయ ఆవరణలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించి స్టూడెంట్లతో మాట్లాడారు. తర్వాత మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నిర్మించనున్న యాత్రికాసదన్, కిచెన్ షెడ్, డార్మెటరీ బిల్డింగ్‌లకు, హుజూరనగర్ సమీపంలోని ముగ్దుంనగర్ వద్ద అగ్రికల్చర్ కాలేజీ, కోదాడలో జవహర్ నవోదయ విద్యాలయానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గవర్నర్ మాట్లాడుతూ... వసంత పంచమి రోజున లక్ష్మీనరసింహుడిని దర్శించుకోవడం, కాలేజు, నవోదయ స్కూల్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయం చేయడం విజ్ఞానం పెంచుకోవడంతో సమానమని చెప్పారు. గతంలో ‘జై జవాన్, జై కిసాన్’ అనే నినాదం ఉండేదని.. ఇప్పుడు ‘జై జవాన్, జై కిసాన్, జైవిజ్ఞాన్, జై అనుసంధాన్’గా మారిందన్నారు. సూర్యాపేట జిల్లాలో సాగు పెద్ద ఎత్తున జరగడం, ప్రత్యేకించి ఆయిల్‌పామ్ సాగు చేపట్టడం అభినందనీయం అన్నారు.
అనంతరం రైతులకు రూ.2.47 కోట్ల విలువైన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రొసీడింగ్స్‌ను, మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.504 కోట్ల చెక్కును అందజేశారు. గవర్నర్ వెంట మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నల్గొండ ఎంపీ. రఘువీర్‌రెడ్డి, అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ జానయ్య, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, ఎస్పీ నరసింహ, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జై వీర్‌రెడ్డి, పద్మావతి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ పాల్గొన్నారు.
