డీఏవీ స్కూల్ రీ ఓపెన్​పై వీడని సస్పెన్స్

డీఏవీ స్కూల్ రీ ఓపెన్​పై వీడని సస్పెన్స్

హైదరాబాద్, వెలుగు: బంజారాహిల్స్​లోని డీఏవీ పబ్లిక్ స్కూల్ రీ ఓపెన్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. స్కూల్ తెరిపించాలని కోరుతూ ఇటు స్టూడెంట్ యూనియన్ నేతలు, అటు పేరెంట్స్ నుంచి సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో బుధవారం  పేరెంట్స్, స్కూల్ మేనేజ్​మెంట్ ప్రతినిధులు ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేనను కలిసి చర్చించారు. చిన్నారిపై లైంగిక దాడి నేపథ్యంలో డీఏవీ పబ్లిక్ స్కూల్ గుర్తింపును ప్రభుత్వం రద్దు చేయడంతో ఏర్పడ్డ సమస్యలను డైరెక్టర్​కు వివరించారు. ఇప్పటికిప్పుడు వేరే స్కూళ్లకు పిల్లలను పంపడం ఇబ్బందేనని పేర్కొన్నారు. ఘటనపై విచారం వ్యక్తం చేసిన స్కూల్ మేనేజ్​మెంట్.. లోపాలను సరిదిద్దుకుంటామని, రీ ఓపెన్ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీనిపై స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మేనేజ్​మెంట్ నుంచి మరోసారి వివరణ కోరారు.  ఎడ్యుకేషన్ డైరెక్టర్ సానుకూలంగా స్పందించారని డీవీఏ స్కూల్ మేనేజర్ శేషాద్రి, పేరెంట్స్ ప్రతినిధులు మీడియాకు తెలిపారు. 

డైరెక్టరేట్ ఎదుట ఎస్​ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆందోళన

ప్రిన్సిపల్ కారు డ్రైవర్ రజనీకుమార్​తో  పాటు ఆమెను సైతం శిక్షించాలంటూ ఎస్ఎఫ్​ఐ, డీవైఎఫ్​ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు ఆందోళన చేశారు. వెంటనే స్కూల్​ను తెరిచి స్టూడెంట్లకు న్యాయం చేయాలన్నారు.  ఎస్ఎఫ్ఐ సిటీ సెక్రటరీ అశోక్ రెడ్డి, డీవైఎఫ్ఐ సెక్రటరీ జావిద్​ మాట్లాడుతూ.. ఇప్పటికే డీఏవీ స్కూల్ మేనేజ్​మెంట్ పేరెంట్స్ నుంచి వేల రూపాయల ఫీజులను వసూలు చేసిందన్నారు. ఇప్పుడు వేరే స్కూల్స్​లో చేర్పిస్తే పేరెంట్స్​పై భారం పడుతుందన్నారు. స్కూల్​ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపించాలని కోరారు.