
- బీఆర్ఎస్ కీలక నేత కోసం ఇంకా డోర్స్ ఓపెన్
- ఇప్పటికే పార్టీలో చేరిన జలగం వెంకట్రావు
- ఆయనకు ఎంపీ టికెట్ పై హామీ ఉందంటున్న అనుచరులు
- కరీంనగర్‌కు చేరిన ఖమ్మం అసమ్మతి!
- ప్యారాచూట్ లీడర్లకు టికెట్ఇవ్వొద్దంటూ బండికి వినతి
ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలోని 15 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఖమ్మంపై సస్పెన్స్ కొనసాగిస్తున్నది. ఇప్పటికే పార్టీలో చేరిన జలగం వెంకట్రావుకు టికెట్‌ను పెండింగ్‌లో పెట్టి, బీఆర్ఎస్ నుంచి వచ్చే కీలక నేత కోసంఎదురుచూస్తోంది. మరోవైపు ఇన్నేండ్లుగా పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లను కాకుండా కొత్తగా వచ్చిన ప్యారాచూట్ లీడర్లకు టికెట్ఇవ్వవద్దని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు అసమ్మతి నేతలు కరీంనగర్వెళ్లి బండి సంజయ్‌ను కలవడం ఆసక్తిరేపుతోంది.
జలగం చేరినా ఆగిన అభ్యర్థి ప్రకటన..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంస్థాగత బలం లేని బీజేపీ ప్రత్యర్థి పార్టీలోని బలమైన నేతలపై కన్నేసింది. ఇందు లో భాగంగానే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును నాలుగు రోజులక్రితం పార్టీలో చేర్చుకుంది. ఎంపీ టికెట్ ఇస్తామన్న హామీతోనే తమ బాస్ బీజేపీలో చేరారని జలగం అనుచరులు చెబుతున్నారు. కానీ, రాష్ట్రంలోని 15 స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, ఖమ్మం స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో ఉంచడం వెనుక మరో కారణం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బీఆర్ఎస్కు చెందిన కీలక నేత కోసం ఇంకా బీజేపీ తలుపులు తెరిచే పెట్టిందని, అందుకే అభ్యర్థిని ప్రకటించకుండా వేచి చూసే ధోరణిలో ఉందని తెలుస్తోంది. కానీ, సదరు నేత నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రావడం లేదని సమాచారం. నిజానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయంగా పట్టుకోసం గతేడాది బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గతేడాది బీఆర్ఎస్ను వీడిన సమయంలో బీజేపీలోకి రప్పించేందుకు చర్చలు కూడా జరిగాయి.
ఈటల రాజేందర్ సహా చేరికల కమిటీ సభ్యులు ఖమ్మం వచ్చి పొంగులేటిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల టైంలో మరికొందరి కోసం కూడా ప్రయత్నించి ఫెయిలయ్యారు. అప్పుడు కూడా జలగం వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానించినా ఆసక్తి చూపలేదు. ఇప్పుడు జలగం చేరిన తర్వాత కూడా బీజేపీ ప్రకటన ఆలస్యం కావడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
ఉమ్మడి జిల్లా నేతల్లో అసంతృప్తి..
ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు విషయంలో వస్తున్న ఊహాగానాలపై ఉమ్మడి జిల్లా బీజేపీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొదటి నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారికే టికెట్ ఇవ్వాలని, బయట పార్టీల నుంచి వచ్చిన వారికి ఛాన్స్ ఇవ్వొద్దంటూ ముఖ్య నేతలు అసమ్మతి గళాలను వినిపిస్తున్నారు. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్‌తో పాటు మరికొందరు నేతలు గురువారం ఖమ్మం నుంచి కరీంనగర్ వెళ్లారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ను కలిసి, తమ వాదన వినిపించారు.
ప్రస్తుతం ఖమ్మం టికెట్ ఆశిస్తున్న వారిలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, గత ఎన్నికల్లో పోటీ చేసిన దేవకి వాసుదేవరావు, డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు (జీవీ), తాండ్ర వినోద్ రావు, కేవీ రమేశ్తదితరులున్నారు. అయితే, వీరిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనేది ఒకట్రెండు రోజుల్లో తేలే అవకాశముంది.