కొండాపై కొనసాగుతున్న సస్పెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సురేఖ వ్యవహారంపై ఢిల్లీలో మంతనాలు

కొండాపై కొనసాగుతున్న సస్పెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..  సురేఖ వ్యవహారంపై ఢిల్లీలో మంతనాలు
  • రోజంతా మీటింగ్స్.. తేలని నిర్ణయం
  • ఖర్గే, కేసీలతో మీనాక్షి, మహేశ్ గౌడ్ భేటీ
  • సీఎం, డిప్యూటీ సీఎం ద్వారా ఖర్గే ఆరా
  • ఏఐసీసీ చీఫ్​ను కలిసి సురేఖ వివరణ 
  • నేను ఏ తప్పు చేయలే.. నాపై చర్యలెలా 
  • తీసుకుంటారు: మీడియాతో సురేఖ
  • హాట్ టాపిక్​గా మంత్రివర్గ ప్రక్షాళన!

న్యూఢిల్లీ, వెలుగు:  కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ అంశంపై సస్పెన్స్​ కొనసాగుతున్నది.ఈ వ్యవహారంపై ఢిల్లీ వచ్చిన రాష్ట్ర ముఖ్య నేతలతో బుధవారం వేర్వేరుగా సమావేశమైన అగ్రనేతలు.. ఇరువైపులా వాదనలు విన్నప్పటికీ ఎలాంటి నిర్ణయాన్ని  ప్రకటించలేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్​, మంత్రి కొండా సురేఖతో కాంగ్రెస్​చీఫ్​ ఖర్గే, పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్​ వరుస భేటీలు నిర్వహించడం, మధ్యలో  కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆమెతో బుధవారమే మంత్రి పదవికి రాజీనామా చేయిస్తారనే ఊహాగానాలు చెలరేగాయి. కానీ సురేఖను ఇప్పటికిప్పుడు మంత్రివర్గం నుంచి తప్పించడం కన్నా త్వరలో చేపట్టబోయే కేబినెట్​ప్రక్షాళనలో భాగంగా పక్కనపెట్టే అవకాశముందని పార్టీవర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తం మీద వివాదం హైకమాండ్​ వద్దకు చేరడం, నిర్ణయాన్ని ఇప్పటికి పెండింగ్​పెట్టడం ఉత్కంఠ రేపుతున్నది.

రోజంతా వరుస భేటీలు 

బుధవారం ఇందిరా భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, నేషనల్ జనరల్ సెక్రటరీ(సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు. తొలుత ఖర్గే, కేసీలతో ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్​ వేర్వేరుగా భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖ అంశంపై పార్టీ తరఫున నివేదికలను అందజేశారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చేసిన సూచనలను హైకమాండ్​ ముందుంచారు.


కొండా సురేఖ కూతురి కామెంట్ల తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలను వివరించారు. ఈ విషయంలో హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.  భవిష్యత్తులోనూ పార్టీ లైన్ దాటకుండా ఈ చర్యలు అవసరమని నివేదించారు. అలాగే, రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్), వెయ్యి రోజుల ప్రభుత్వ పాలన, ఇతర అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వివాదానికి సంబంధించిన పలు వివరాలను ఖర్గే ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, ఖర్గేతో మంత్రి ఉత్తమ్ ​కుమార్ ​రెడ్డి కూడా సమావేశమై.. పలు అంశాలపై చర్చించారు.

ఖర్గే, కేసీతో సీఎం చర్చలు 

కేంద్ర మంత్రి రాజ్​నాథ్ సింగ్‌‌తో భేటీ అనంత రం మధ్యాహ్నం 12:10 గంటలకు సీఎం రేవం త్ రెడ్డి నేరుగా ఇందిరా భవన్ చేరుకున్నారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌‌తో సీఎం సమావేశం అయ్యారు. ప్రధానంగా కొండా సురేఖ అంశంతోపాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఇతర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. తనతోపాటు ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చిన కొండా వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్టు సమాచారం. 

పార్టీ క్రమశిక్షణా చర్యల కింద చూడాలి

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ అంశాన్ని పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యం గా కాకుండా.. పార్టీ క్రమశిక్షణా చర్యల కింద చూడాలని హైకమాండ్‌‌ను కోరారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన రిపోర్ట్, గతంలోనూ వివాదస్పదమైన కొండా వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. రెండున్నరేండ్ల కాలం ముగిసినందున మంత్రుల పనితీరు, సమర్థతను పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ ప్రక్షాళనకు అనుమతివ్వాలని కోరారు.  సామాజిక సమీకరణాలు, ప్రాంతాలవారీ ప్రయార్టీగా ఆశావాహుల లిస్ట్​ను అందజేసినట్టు తెలిసింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కూడా చర్చించినట్టు సమాచారం.

ఖర్గేతో అరగంటపాటు సీఎం భేటీ 

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. రాజాజీ మార్గ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఖర్గే నివాసంలో ఈ భేటీ జరిగింది. దాదాపు అరగంటకుపైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా కొండా సురేఖ వివాదంపై చర్చించినట్టు తెలిసింది. అలాగే, కేబినెట్ విస్తరణ, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఇందులో భాగంగా నేతలిద్దరూ ఖర్గేకు వేర్వేరుగా నివేదికలు అందజేసినట్టు సమాచారం. మంత్రి కొండా సురేఖ కూతురు.. సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లను వివరించారు. తద్వారా  ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్ జరుగుతున్న తీరును తెలిపారు. ఈ సందర్భంగా కొండా సురేఖతోపాటు లైన్ దాటి వ్యవహరిస్తున్న ఇతర నేతల వివరాలను ఖర్గే అడిగి తెలుసుకున్నారు. మంత్రి వర్గ ప్రక్షాళన, నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. అనంతరం కానిస్టిట్యూషన్ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  వైఎస్ఆర్ అవార్డ్స్  కార్యక్రమంలో పాల్గొనేందుకు  ఖర్గే కారులోనే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లడం గమనార్హం.


నన్ను బర్తరఫ్ చేయలేరు రాజీనామా చేయాలని అడిగితే ఏం చేయాలో చేస్తా: సురేఖ

న్యూఢిల్లీ, వెలుగు: తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేరని, కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా మాత్రమే చేయాలని చెప్పగలరని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అప్పుడు తాను ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆలోచిస్తానని అన్నారు.  పార్టీలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడేటోళ్లకు షోకాజ్ ఇవ్వాలంటే మొదట సీఎం రేవంత్ రెడ్డితోనే మొదలు పెట్టాలని వ్యాఖ్యానించారు. రాబోయే పదేండ్లు సీఎం తానే అని చెప్పుకోవడం పార్టీ లైన్ దాటడం కాదా? అని ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రేమో నేరుగా టికెట్లు ప్రకటించవచ్చా? కానీ, ఆయనకు నోటీసులు ఇవ్వరా? 119 అసెంబ్లీలకు కాకుండా ఒకటే టికెట్ ఎందుకు ప్రకటిస్తారు? అంటే, ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని రెచ్చగొట్టడానికే కదా?’’ అని అడిగారు. బుధవారం ఇందిరా భవన్‌‌లో ఆమె పార్టీ చీఫ్ ఖర్గే తో సమావేశం అయ్యారు. అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు, తనపై వచ్చిన ఫిర్యాదులు, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తనను బాధ్యురాలిని చేస్తున్నారని, వాటిపై ఖర్గేకు వివరణ ఇచ్చానని చెప్పారు.  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌‌ను కూడా కలిసి తన వర్షన్‌‌ను వినిపించినట్టు సురేఖ తెలిపారు. ఖర్గే, మీనాక్షి ఇద్దరూ తన పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు.  బీసీ మహిళా మంత్రిని కాబట్టే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.  తనపై కుట్ర చేస్తున్న వారి పేర్లు తనకు తెలుసని చెప్పారు. తెలంగాణలోని పరిస్థితులు, తనపై జరుగుతున్న కుట్రపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌‌కు ఇప్పటికే సుదీర్ఘమైన మెయిల్ చేసినట్టు చెప్పారు. తన కుమార్తె వివాహం జరిగి ఇండిపెండెంట్‌‌గా జీవిస్తున్న వ్యక్తి అని, ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు కలిగి ఉందని తెలిపారు. ‘‘నా కూతురు మాట్లాడిన దానికి నాకు షోకాజ్ ఇచ్చారు. ఆమెను అలా మాట్లాడొద్దని చెప్పే అధికారం నాకు లేదు” అని పేర్కొన్నారు.  ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయన కొడుకు అర్వింద్‌‌ ఇష్టానుసారంగా మాట్లాడారని.. మరి అప్పుడు ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. బీజేపీని, పార్టీ నాయకులను పరకాల ప్రభాకర్ తిడితే నిర్మలా సీతారామన్‌‌కు నోటీసులు ఇస్తారా?  అని మంత్రి సురేఖ నిలదీశారు.

చూస్తం..ఆలోచిస్తం అన్నరు

శంషాబాద్, వెలుగు: ఢిల్లీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు ​ఖర్గే, రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ బుధవారం రాత్రి హైదరాబాద్​ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో మీడియాతో మాట్లాడారు.‘‘మీనాక్షి నటరాజన్‌‌ను, ఖర్గేను కలిశాను. నా ఆలోచన చెప్పాను. జరిగిన పరిణామాలు వివరించాను. వాళ్లు చూస్తం..ఆలోచిస్తం అని చెప్పారు” అని పేర్కొన్నారు. అధిష్టానం ఏం హామీ ఇచ్చిందని ప్రశ్నించగా..‘‘పార్టీలో డిస్కస్​ చేయాలి కదా.. వాళ్లిద్దరే డైరెక్ట్‌‌గా ఏం చెప్పలేరు కదా.. పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారేమో’’ అని అన్నారు.