ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే విపక్ష ఎంపీల సస్పెన్షన్ : మల్లికార్జున ఖర్గే

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే విపక్ష ఎంపీల సస్పెన్షన్ : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకే మోదీ సర్కార్ పార్లమెంట్​లో సస్పెన్షన్​ను అస్త్రంగా వాడుకుందని ఏఐసీసీ చీఫ్, రాజ్యసభ విపక్ష పార్టీ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఉభయ సభల్లో మూకుమ్మడిగా ఎంపీలను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ ముందుగానే నిర్ణయించి, ప్లాన్ అమలు చేసినట్లు ఆరోపించారు. సభకు హాజరుకాని ఇండియా కూటమి ఎంపీని సైతం సస్పెండ్ చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీల తీరుపై ఇటీవల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్ రాసిన లేఖకు సోమవారం ఖర్గే కౌంటర్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి లేఖ దురదృష్టవశాత్తు పార్లమెంట్ పట్ల ప్రభుత్వ నిరంకుశ, దురహంకార వైఖరిని సమర్థిస్తున్నదని దుయ్యబట్టారు. 

హోం మంత్రి రాజ్యసభకు హాజరుకాక ముందే చాలా మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తారని ఒక కేంద్ర మంత్రి విపక్ష పార్టీ ఎంపీకి చెప్పినట్లు గుర్తు చేశారు. ఇలాంటి బెదిరింపులు నిజమే అయితే  చైర్మన్ గా ఈ అంశంపై విచారణ చేపడతారని ఆశించినట్లు చెప్పారు. సభకు సంరక్షకు(రాజ్యసభ చైర్మన్)డిగా, పార్లమెంటులో తమ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచే ప్రజల హక్కును చైర్మన్ కాపాడాలని మల్లికార్జున్ ఖర్గే సూచించారు. కానీ చైనాతో బార్డర్ సమస్యలు, మణిపూర్ లో హింసాత్మక అల్లర్లు, బీజేపీ ఎంపీ ఇచ్చిన పాస్ లతో లోక్ సభలో దుండగులు సృష్టించిన భద్రతా ఉల్లంఘనల వంటి అంశాలపై చర్చ నుంచి అధికార పార్టీ తప్పించుకుందనే విషయాన్ని చైర్మన్ గుర్తించాలన్నారు. 

సభను నడిపేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోతే.. చైర్మన్ చాంబర్​లో జరిగే చర్చలో సమాధానం ఉండదన్నారు. చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించిన ప్రిసైడింగ్ ఆఫీసర్ల తీరు సైతం బాధ కలిగించిందన్నారు. కాగా పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనలు, ఎంపీల సస్పెన్షన్​పై చర్చించేందుకు ఈ నెల 25న తన నివాసానికి రావాలని ఉప రాష్ట్రపతి ధన్​ఖడ్, ఇటీవల ఖర్గేకు లేఖ రాశారు. అయితే ప్రస్తుతం ఢిల్లీలో లేనని, వచ్చిన వెంటనే రాజ్యసభ చైర్మన్ ఆహ్వానం మేరకు ఆయనతో భేటీ కావడం తన  బాధ్యతగా భావిస్తున్నట్లు ఖర్గే  లేఖలో స్పష్టం చేశారు.