కారు ప్రమాదంపై వీడని మిస్టరీ

కారు ప్రమాదంపై వీడని మిస్టరీ

కరీంనగర్, వెలుగు: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెల్లెలు, బావ, కోడలి మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. కాకతీయ కాలువలో పడిపోయిన కారు నుంచి ఆ ముగ్గురి మృతదేహాలను సోమవారం వెలికితీసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటన ఎలా జరిగిందనేది మాత్రం సస్పెన్స్ గా మిగిలిపోయింది. ప్రమాదవశాత్తు కారు కాలువలోకి దూసుకెళ్లిందా? లేక వారే ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా పడేశారా? వంటి ప్రశ్నలకు స్పష్టత రాలేదు.

27వ తేదీనే ఘటన!

సత్యనారాయణ రెడ్డి తన భార్య రాధతో కలిసి కరీంనగర్​లో ఉంటారు. వీరి కూతురు వినయశ్రీ.. నిజామాబాద్ లోని ఓ డెంటల్ కాలేజీలో బీడీఎస్ చదువుతోంది. ఈమె హైదరాబాద్​లో హౌస్ సర్జన్ గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది. వినయశ్రీ వసతి కోసం గది చూసేందుకు కుటుంబం తరచూ హైదరాబాద్ వెళ్లి వస్తున్నట్లు సమాచారం. జనవరి 27న కరీంనగర్ కార్పొరేషన్ లో ఓట్ల లెక్కింపు ఉండటంతో అక్కడ పలువురిని సత్యనారాయణ రెడ్డి కలిసినట్లు తెలిసింది. అదే రోజు మధ్యాహ్నం ఎరువుల దుకాణంలో పనిచేసే నర్సింగ్ కు ఫోన్ చేశారు. తర్వాత ఏం జరిగిందనే దానిపై క్లారిటీ రావట్లేదు. 27న హైదరాబాద్ వెళ్లినట్లు ఎక్కడ కనిపించలేదు. రేణికుంట టోల్ ప్లాజా వద్ద ఫీజు చెల్లించినట్లు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే 27నే ఘటన జరిగిందని తెలుస్తోంది.

కాల్ డేటా సేకరణ

కేసు దర్యాప్తులో రాధ, వినయశ్రీ, సత్యనారాయణ రెడ్డి ఫోన్లు కీలకం కానున్నాయి. వీటిని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల నుంచి కాల్ డేటా మొత్తం సేకరించనున్నారు. దీంతోపాటు హైదరాబాద్ వైపు ఉన్న అన్ని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించనున్నారు. ముగ్గురు కలిసి 21వ తేదీన హైదరాబాద్ వెళ్లి 22న ఇంటికి వచ్చారు. తర్వాత 26న వెళ్లి అదే రోజు రాత్రి ఇంటికి చేరుకున్నారు. మర్నాడే మరోసారి హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

ముందు టైర్ పంచర్ అయిందా..?

సాధారణంగా కారు ప్రమాదానికి గురైనప్పుడు ఏ స్థితిలో ఉందో అదే స్థితిలో అన్ని పార్ట్స్ ఆగిపోతాయి. కారు ముందువైపున కుడి టైర్​లో పూర్తిగా గాలి లేదు. ఒకవేళ టైర్ పంచర్ కావడంతోనే ప్రమాదం జరిగితే.. కారు కుడి వైపు వెళ్లాలి కానీ ఎడమవైపున ఉన్న కాలువ లోకి ఎలా దూసుకెళ్లింది. మరోవైపు ముగ్గురి డెడ్ బాడీలు వెనుక సీట్లలో దొరికాయి. ఈ నేపథ్యంలో కారును మోటార్ వెహికల్ ఇన్​స్పెక్టర్(ఎంవీఐ) కు అప్పగించి కీలక వివరాలు సేకరిస్తారని తెలిసింది.