బెంగాల్‌లో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య

బెంగాల్‌లో కాల్పులు.. సువేందు అధికారి పీఏ హత్య

కారులో వెళ్తుండగా కాల్పులు జరిపిన దుండగులు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో రాజకీయ హింస ఒక్కసారిగా భగ్గుమంది. బీజేపీ కీలక నాయకుడు, ప్రతిపక్ష మాజీ నేత సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు.  సీఎం రేసులో ఉన్న కీలక నేత పీఏ గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతిచెందడం కలకలం రేపింది. 

కోల్‌కతా సమీపంలోని ఉత్తర 24 పరగణాల జిల్లా.. మధ్యమ్‌గ్రామ్ నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. చంద్రనాథ్ రథ్ తన స్నేహితుడు బుద్ధదేవ్‌తో కలిసి కారులో వెళ్తుండగా దుండగులు వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. 

ఈ కాల్పుల్లో చంద్రనాథ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, బుద్ధదేవ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.