డీసీడబ్ల్యూ పదవికి స్వాతి మలివాల్‌ రాజీనామా

 డీసీడబ్ల్యూ పదవికి స్వాతి మలివాల్‌ రాజీనామా

ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ పదవికి స్వాతి మలివాల్ 2024  జనవరి 5వ తేదీన రాజీనామా చేశారు. ఆమెను ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేయడంతో  రాజీనామా చేశారు. అనంతరం తన చాంబర్‌లో తోటి ఉద్యోగులు వీడ్కోలు పలికారు.  ఈ క్రమంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు.  తన సిబ్బందిని హత్తుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.  డీసీడబ్ల్యూ పదవి చేపట్టకముందు స్వాతి మలివాల్  ఢిల్లీ సీఎం కేజ్రివాల్ కు సలహాదారుగా పనిచేశారు.  

ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం స్వాతి మలివాల్‌ను రాజ్యసభకు నామినేట్ చేసింది.  ఢిల్లీతో పాటుగా సిక్కంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు 2024 జనవరి 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని మూడు స్థానాలకు ఆప్ నేతలు సంజయ్ సింగ్, సుశీల్ కుమార్ గుప్తా,  నారాయణ్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.  వీరి పదవీకాలం జనవరి 27తో ముగియనుంది.  సంజయ్ సింగ్,  నారాయణ్ ను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసిన ఆప్..  సుశీల్ కుమార్ గుప్తా స్థానంలో మాత్రం  స్వాతి మలివాల్‌ కు అవకాశం ఇచ్చింది.  స్వాతి మలివాల్‌ రాజ్యసభకు నామినేట్ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.  

మరోవైపు సుశీల్ కుమార్ గుప్తాకు హర్యానా బాధ్యతలను అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. రాజ్యసభలో రాఘవ్ చద్దా, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సహా ఆప్‌కి ప్రస్తుతం 10 మంది సభ్యులు ఉన్నారు. కాగా ఈ ఏడాది  ఏకంగా 68 రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. రాజ్యసభ పదవీకాలం పూర్తికానున్న నేతల్లో పలువురు కేంద్రమంత్రులు, కీలక నేతలు ఉన్నారు.