V6 News

బత్తాయి కనుమరుగు!...ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటేటా తగ్గుతోన్న సాగు

బత్తాయి కనుమరుగు!...ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏటేటా తగ్గుతోన్న సాగు
  • 3.10 లక్షల ఎకరాల నుంచి 40 వేల ఎకరాలకు డౌన్​
  •     మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతుల అనాసక్తి
  •     గతంతో పోలిస్తే భారీగా పెరిగిన పెట్టుబడి
  •     ఆయిల్​ పామ్​ పంట వైపు మొగ్గు చూపుతున్న రైతులు

నల్గొండ, వెలుగు: ఒకప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు గుర్తింపుగా నిలిచిన బత్తాయి తోటలు క్రమంగా తగ్గిపోతున్నాయి. స్థానికంగా మార్కెట్ సదుపాయం లేకపోవడం, డిమాండ్ తగ్గిపోవడం, బత్తాయిని ప్రాసెసింగ్ చేసి ఉత్పత్తులు తయారు చేసే సాంకేతికత లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఈ పంటకు దూరమవుతున్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే పంట అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో రైతులు సాగును వదులుకుంటున్నారు. గతంలో టన్నుకు రూ.45 వేల వరకు ధర పలికిన బత్తాయి ప్రస్తుతం రూ.15 వేల లోపే పడిపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

పెరిగిన ఖర్చు.. తగ్గిన విస్తీర్ణం..

ఉమ్మడి రాష్ట్రంలో బత్తాయి తోటలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రసిద్ధి చెందింది. ఒకప్పుడు సుమారు మూడు లక్షల ఎకరాల్లో సాగు జరిగిన ఈ పంట ప్రస్తుతం 40 వేల ఎకరాలకే పరిమితమైంది. ఎరువుల ఖర్చులు పెరగడం, గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక ఎకరాలో బత్తాయి సాగు చేయాలంటే సుమారు రూ.50 వేల వరకు పెట్టుబడి అవసరం కాగా, నాలుగు నుంచి ఆరు టన్నుల వరకు మాత్రమే దిగుబడి వస్తోంది. 

నాణ్యమైన బత్తాయికి టన్నుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ధర ఉన్నప్పటికీ, మంగు తెగుళ్ల ప్రభావంతో దిగుబడి తగ్గుతోంది. తోటలను రక్షించేందుకు అధికంగా ఎరువులు, మందులు వాడడం వల్ల భూమిలో సారం తగ్గి కాయల పరిమాణం చిన్నవుతోంది. దీంతో టన్నుకు రూ.15 వేలకే పరిమితమవుతోంది.

నిల్వ సమస్యలు..

ఇక బత్తాయి నిల్వ సామర్థ్యం కూడా తక్కువ. పండ్ల రూపంలో పది రోజులకు మించి నిల్వ ఉంటే చేదుగా మారుతుంది. జ్యూస్‌‌‌‌గా మార్చినా రెండు మూడు రోజులకే రుచి మారిపోతుంది. దీంతో గత ఐదారేళ్లుగా కొత్తగా ఎవరూ బత్తాయి సాగు చేపట్టడం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 15 ఏళ్లలో జిల్లాలో బత్తాయి సాగు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు బత్తాయి స్థానంలో ఆయిల్ పామ్ వంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు.

బయటి మార్కెటే దిక్కు..

బత్తాయి ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడం వల్ల రైతులు జాతీయ మార్కెట్‌‌‌‌పై ఆధారపడాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని వ్యాపారులు సిండికేట్‌‌‌‌గా మారి తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన బత్తాయి మార్కెట్ కూడా కొనుగోలుదారులు లేకపోవడంతో వడ్ల కొనుగోలు కేంద్రంగా మారింది. దీంతో రైతులు హైదరాబాద్ బాటసింగారం మార్కెట్‌‌‌‌తో పాటు దిల్లీ, కొల్‌‌‌‌కత్తా, చెన్నై, అనంతపురం, కడప వంటి ప్రాంతాల మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు.

కేంద్రం ప్రవేశపెట్టిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ పథకంలో నల్గొండ జిల్లాకు బత్తాయి గుర్తింపు వచ్చినప్పటికీ, ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవసరమైన సాంకేతికత లేకపోవడంతో రైతులకు ప్రయోజనం కలగలేదు. తిప్పర్తిలో రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన జ్యూస్ యూనిట్ కూడా కొద్ది రోజుల్లోనే మూతపడింది. బత్తాయికి జీఐ ట్యాగ్ తీసుకువస్తామని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదు.

బత్తాయిని తీసేసి వరి సాగు చేస్తున్నా..

నేను 24 ఏండ్లు ఐదు ఎకరాల్లో బత్తాయి సాగు చేశా. ప్రతి సంవత్సరం సుమారు రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టినా లాభం రాలేదు. చీడపీడలు పెరగడం, కూలీ ఖర్చులు అధికం కావడం, సరైన ధర రాకపోవడంతో బత్తాయి తోటను తీసేసి ప్రస్తుతం వరి సాగు చేస్తున్నాను.
- మాల కొండయ్య, రైతు, హాలియా

ఆర్గానిక్​ ఎరువులు వాడితే మేలు

రైతులు అధికంగా ఎరువులు, రసాయనాలు వాడడం వల్ల భూముల్లో సారం తగ్గి తెగుళ్లు పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడం, అకాల వర్షాలు కూడా బత్తాయి సాగుపై ప్రభావం చూపుతున్నాయి. రైతులు ఆర్గానిక్ ఎరువులు ఉపయోగిస్తే మంచి దిగుబడులు సాధ్యం. 
- సుభాషిణి, ఉద్యాన శాఖ అధికారి, నల్గొండ