మందు ప్రియులకు పండగే పండగ: జొమాటో, స్విగ్గీ ద్వారా లిక్కర్ డోర్ డెలివరీ

మందు ప్రియులకు పండగే పండగ: జొమాటో, స్విగ్గీ ద్వారా లిక్కర్ డోర్ డెలివరీ

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ అయిన స్విగ్గీ, జొమాటోలో ఇన్నాళ్లూ ఫుడ్ మాత్రమే ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది. కానీ.. ఇకపై స్విగ్గీ, జొమాటోలో మద్యం ప్రియులు మందు కూడా ఆర్డర్ చేసుకోవచ్చట. ఈ ముచ్చట తెలియగానే అదేదో సినిమాలో బ్రహ్మానందం అనుకున్నట్టు ‘అంటే అన్నాడు గానీ.. ఆ ఊహే ఎంత బాగుందో’ అని మందు ప్రియులు గాల్లో తేలిపోతారేమో. ఈ వార్త పచ్చి నిజం. మద్యం ప్రియులకు తాగకుండానే కిక్కెక్కేంత నిజం. స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ యాప్స్ త్వరలో మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఆల్కహాల్ ను హోం డెలివరీ చేయబోతున్నాయి. బిర్యానీ ఆర్డర్ చేసినంత సింపుల్ గా మద్యం ప్రియులు బీర్ ఆర్డర్ చేసుకోవచ్చు. లో ఆల్కహాల్ డ్రింక్స్ అయిన బీర్, వైన్, లిక్కర్ లోని కొన్ని రకాలను మాత్రమే డెలివరీ చేయనున్నట్లు తెలిసింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ను తొలుత న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, పంజాబ్, తమిళనాడు, గోవా, కేరళ రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయాలని స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ భావిస్తున్నాయి.

మద్యం డెలివరీకి అనుమతి ఇస్తే ఉండే ఇబ్బందులపై ఆయా రాష్ట్రాల్లో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ రాష్ట్రాల్లో మద్యం డెలివరీ సక్సెస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో కూడా స్విగ్గీ, జొమాటోలో మద్యం హోం డెలివరీ చేసేందుకు అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. లాక్ డౌన్ సమయంలో జార్ఖండ్ లోని రాంచీలో మద్యం హోం డెలివరీ సేవలను  స్విగ్గీ తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అప్పట్లో వెస్ట్ బెంగాల్, ఒడిశాలో మద్యం హోం డెలివరీ సేవల వల్ల 20 నుంచి 30 శాతం మద్యం అమ్మకాలు పెరిగినట్లు రిటైల్ లిక్కర్ ఇండస్ట్రీ ప్రతినిధులు తెలిపారు. అయితే.. స్విగ్గీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. మద్యం హోం డెలివరీకి త్వరలో సాధ్యమవుతుందని కానీ ఆర్డర్ చేసే వారి వయసు నిర్ధారణ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Also Read:ఓరేయ్ ... ఏం ఛాయ్​ రా .. ఇది తాగితే డైరక్ట్​గా పరలోకానికే..