గ్రాండ్‌‌స్లామ్‌‌ యూఎస్‌‌ ఓపెన్‌‌లో ఇగా స్వైటెక్‌‌ బోణీ

గ్రాండ్‌‌స్లామ్‌‌ యూఎస్‌‌ ఓపెన్‌‌లో ఇగా స్వైటెక్‌‌ బోణీ

న్యూయార్క్‌‌ : సీజన్‌‌ చివరి గ్రాండ్‌‌స్లామ్‌‌ యూఎస్‌‌ ఓపెన్‌‌లో.. వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌ ఇగా స్వైటెక్‌‌ బోణీ చేసింది. సోమవారం జరిగిన విమెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో టాప్‌‌సీడ్‌‌ స్వైటెక్‌‌ (పోలెండ్‌‌) 6–0, 6–1తో రెబెకా పీటర్సన్‌‌ (స్వీడన్‌‌)పై గెలిచింది. 58 నిమిషాల మ్యాచ్‌‌లో స్వైటెక్‌‌ ఆరంభం నుంచే బలమైన ఫోర్‌‌ హ్యాండ్‌‌, బ్యాక్‌‌ హ్యాండ్‌‌ షాట్లతో రెచ్చిపోయింది. మ్యాచ్‌‌ మొత్తంలో 4 ఏస్‌‌లు, 20 విన్నర్స్‌‌ కొట్టిన స్వైటెక్‌‌ ఒకే ఒక్క డబుల్‌‌ ఫాల్ట్‌‌ చేసింది. 

ఆరు బ్రేక్‌‌ పాయింట్లలో ఐదింటిని కాచుకుంది. ఓవరాల్‌‌గా మేజర్‌‌ టోర్నీలో స్వైటెక్‌‌ తన రికార్డును 18–1కు పెంచుకోగా, యూఎస్‌‌ ఓపెన్‌‌లో 5–0తో ఉంది. మరో మ్యాచ్​లో విక్టోరియా అజరెంకా (బెలారస్‌‌) 6–1, 6–2తో ఫియానో ఫెర్రో (ఫ్రాన్స్‌‌)పై గెలవగా, 8వ సీడ్‌‌ మరియా సక్కారి (గ్రీస్‌‌)కు ఊహించని షాక్‌‌ తగిలింది. అన్‌‌సీడెడ్‌‌ ప్లేయర్‌‌ రెబెకా మసరోవా 6–4, 6–4తో సక్కారిపై నెగ్గింది. ఇతర మ్యాచ్‌‌ల్లో ముచోవా (చెక్‌‌) 6–4, 6–0తో హంటర్‌‌ (అమెరికా)పై, మగ్దలెనా ఫ్రెంచ్‌‌ (పోలెండ్‌‌) 7–6 (12/10), 1–6, 6–2తో ఎమ్నా నవారో (అమెరికా)పై, టౌన్సెండ్‌‌ (అమెరికా) 6–4, 6–2తో గ్రాచెవా (ఫ్రాన్స్‌‌)పై, బెలిండా బెనిసిచ్‌‌ (స్విట్జర్లాండ్‌‌) 6–2, 6–4తో కామిల్లా రఖిమోవా (రష్యా)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించారు. మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో డొమ్నిక్‌‌ థీమ్‌‌ (ఆస్ట్రియా) 6–3, 6–2, 6–4తో అలెగ్జాండర్‌‌ బుబ్లిక్‌‌ (కజకిస్తాన్‌‌)పై, షెల్టన్‌‌ (అమెరికా) 1–6, 6–3, 6–2, 6–4తో పెడ్రో కాచిన్‌‌ (అర్జెంటీనా)పై నెగ్గి తదుపరి రౌండ్‌‌లోకి అడుగుపెట్టారు.