కారుణ్య మరణానికి సూసైడ్ మెషీన్

కారుణ్య మరణానికి సూసైడ్ మెషీన్

జెనీవా: కారుణ్య మరణానికి ఎదురుచూస్తున్నవారి కోసం స్విట్జర్లాండ్​ కంపెనీ ఓ కొత్త మెషీన్​ తయారు చేసింది. కేవలం ఒక్క నిమిషంలోనే ఎలాంటి నొప్పి లేకుండా, ప్రశాంతంగా చనిపోయేందుకు ఈ మెషీన్​ ఉపయోగపడుతుందని చెబుతోంది. ప్రభుత్వం కూడా దీనిని గుర్తించి, చట్టబద్ధం చేసింది. కారుణ్య మరణాలు కూడా స్విట్జర్లాండ్​లో చట్టబద్ధమే! ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా కొన్ని సంస్థలు కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. కిందటేడాది ఇలాంటి సంస్థల ద్వారా 1300 మంది కారుణ్య మరణం పొందారు. ఇలాంటి ఓ ఆర్గనైజేషనే ‘ఎగ్జిట్​ ఇంటర్నేషనల్’. ఈ సంస్థకు డైరెక్టర్​గా ఉన్న డాక్టర్ ఫిలిప్​ నిట్చికే ఈ  సూసైడ్​ మెషీన్​ను తయారుచేసిండు. స్థానికులు ఆయనను డాక్టర్​ డెత్​ అని కూడా పిలుస్తారు. శవపేటికను పోలిన ఈ మెషీన్​ను కావాల్సిన చోటికి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. 

ఇదెలా పనిచేస్తదంటే..
లోపల పడుకోబెట్టిన మనిషి శరీరంలో ఆక్సీజన్​ లెవెల్స్​ను తగ్గించేస్తుంది. రక్తంలో కార్బన్​డయాక్సైడ్​ను కూడా తగ్గించడం వల్ల నొప్పి లేకుండా చనిపోతారట. దీనిని బయట నుంచే కాదు.. లోపల నుంచి కూడా ఆపరేట్​ చేయొచ్చని నిట్చికే చెప్పారు. శరీరమంతా చచ్చుబడి, కేవలం కండ్లు మాత్రమే కదపగలిగే స్థితిలో ఉన్న పేషెంట్లకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందన్నారు. కనురెప్పలు ఆర్పుతూ, తెరవడం ద్వారా మెషీన్​ను ఆన్​ చేసేలా డిజైన్​ చేశామని వివరించారు. అయితే, గ్యాస్​ ఛాంబర్​ను గ్లామరైజ్ చేసి తయారు చేసిందే ఈ మెషీన్​ అని విమర్శకులు మండిపడుతున్నారు. ఆత్మహత్యకు ఈ మెషీన్​ గ్లామర్​ జోడించిందని ఇంకొందరు 
విమర్శిస్తున్నారు.