మత్తు కల్లు ముఠాలపై టీ న్యాబ్ నజర్

మత్తు కల్లు ముఠాలపై టీ న్యాబ్ నజర్

హైదరాబాద్‌‌, వెలుగు: కల్లు కల్తీ చేస్తున్న ముఠాలపై టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్‌‌)స్పెషల్ ఆపరేషన్​ప్రారంభించింది. మత్తు కోసం కల్లులో కలిపే అల్ప్రాజోలం సప్లయ్ నెట్‌‌వర్క్‌‌ను బ్రేక్ చేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నది. కామారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు ముస్తేదారులు సహా ఎక్సైజ్ కానిస్టేబుల్‌‌ను అరెస్ట్ చేసింది. ఈ వివరాలను టీఎస్ న్యాబ్ డైరెక్టర్‌‌‌‌ సందీప్ శాండిల్య సోమవారం వెల్లడించారు. ఈ ఏడాది డీఆర్‌‌‌‌ఐ అధికారులు నమోదు చేసిన రూ.3 కోట్లు విలువ చేసే 30 కిలోల అల్ప్రాజోలం కేసు ఆధారంగా అల్ప్రాజోలం చైన్‌‌ లింక్‌‌ను ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. 

విజయవాడలో తయారీ..

అల్ప్రాజోలం సప్లయ్ నెట్‌‌వర్క్‌‌ మేడ్చల్ జిల్లా సూరారంలో ఉన్నట్లు టీన్యాబ్‌‌ గుర్తించింది. ఆదివారం సెర్చెస్ చేసింది. నరేందర్‌‌, సతీష్‌‌ గౌడ్‌‌ అనే సప్లయర్స్‌‌ వద్ద10 కిలోల అల్ప్రాజోలంను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. విజయవాడలోని పరమేశ్వర కెమికల్స్‌‌లో అల్ప్రాజోలం తయారీ చేసినట్లు గుర్తించారు. లింగయ్య గౌడ్‌‌ అనే వ్యక్తి రోజుకు రూ.4 లక్షల చొప్పున 5 రోజుల పాటు లీజ్‌‌కు తీసుకున్నాడు. అతని ఆధ్వర్యంలో 75 కిలోల‌‌ అల్ప్రాజోలంను తయారు చేసి  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సప్లయ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఎక్సైజ్‌‌ కానిస్టేబుల్ ప్రమేయం..

లింగయ్య గౌడ్‌‌ తన నెట్‌‌వర్క్‌‌లోని కామారెడ్డి ఎక్సైజ్ కానిస్టేబుల్‌‌ రమేష్‌‌తో కలిసి సప్లయ్ చేస్తున్నాడు. స్థానిక ముస్తేదారులతో కలిసి కల్లుదుకాణాలకు అల్ప్రాజోలం ట్రాన్స్‌‌పోర్ట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కామారెడ్డి బొల్లారానికి చెందిన విఠల్, నాగిరెడ్డి పేట్‌‌ మండలానికి చెందిన మరో ఇద్దరు ముస్తేదారుల ను టీ న్యాబ్‌‌ పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లాకు చెందిన మరో ముగ్గురు ముస్తేదారులను టీ న్యాబ్ అరెస్ట్ చేసింది. గత15 రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 14 కిలోల అల్ప్రాజోలం సీజ్ చేసి నిందితులు మహ్మద్ యూనుస్ అలియాస్ జక్కరాజులను అరెస్ట్ చేసినట్లు టీఎస్​న్యాబ్​డైరెక్టర్​శాండిల్య తెలిపారు. కాగా రాష్ట్రంలో రెండేండ్ల వ్యవధిలో మొత్తం 43 కేసులు నమోదు కాగా, సిటీలో 66 కేసులు రిజిస్టర్‌‌‌‌ అయినట్లు ఆయన పేర్కొన్నారు.