టైటిల్: తాజా ఖబర్2; ప్లాట్‌ఫామ్: డిస్నీ హాట్ స్టార్ ప్లస్
డైరెక్టర్ : హిమాంక్ గౌర్ ; కాస్ట్ : భువన్ బామ్, శ్రియా పిల్గావ్కర్, జే డీ చక్రవర్తి, దేవెన్ భోజని, శిల్పా శుక్లా
తాజా ఖబర్ హిందీ వెబ్ సిరీస్ మొదటి సీజన్ 2023 జనవరిలో స్ట్రీమ్ అయింది. ఆరు ఎపిసోడ్స్ గా వచ్చిన ఆ సిరీస్‌కు రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఇది సీజన్ 2. ఆరు ఎపిసోడ్స్‌తో వచ్చిన ఈ సిరీస్ గురించి..
కథ ముంబయిలో జరుగుతుంటుంది. వసంత్ (భువన్ బామ్)ది పేద కుటుంబం. వృద్ధులైన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అతని ఫ్రెండ్ ‘పీటర్’ ఎప్పుడూ వసంత్తోనే ఉంటాడు. వసంత్, మధుబాల (శ్రియ) ఇద్దరూ ప్రేమించుకుంటుంటారు. మధుబాలపై మనసుపడ్డ శెట్టి ( జేడీ చక్రవర్తి), వసంత్ను అడ్డుతప్పించాలని ట్రై చేస్తుంటాడు. వసంత్ దగ్గరున్న ఫోన్‌కి ఎప్పటికప్పుడు జరగబోయే విషయాలకు సంబంధించిన సమాచారం వస్తుంటుంది.
ప్రపంచవ్యాప్తంగా జరగబోయే సంఘటనలు తన ఫోన్‌కి రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎక్కడ? ఏం జరగనుంది? డబ్బు ఎక్కడ చేతులు మారనుంది? ఏ ఆటలో ఎవరు గెలవనున్నారు? వంటి విషయాలన్నీ ముందుగానే తెలిసిపోతుంటాయి వసంత్‌కి. దాంతో బెట్టింగ్‌ను ప్రొఫెషన్‌గా చేసుకుని చాలా తక్కువ టైంలో కోటీశ్వరుడు అవుతాడు. తన వాళ్లందరికీ ఏ లోటు రాకుండా చూసుకుంటుంటాడు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో వసంత్ హత్యకి గురవుతాడనే మెసేజ్అతని ఫోన్‌కి వస్తుంది. ఆ తరువాత ఏం జరుగుతుందనే సస్పెన్స్‌తో ఫస్ట్ సీజన్ ఎండ్ అవుతుంది.
ఇక సెకండ్ సీజన్లోకి వస్తే... తను చనిపోయేలోపు మంచి పనులు చేయాలనుకుంటాడు వసంత్. అందుకని తన కాలనీవాసులకు డబ్బు పంచుతుంటాడు ఒకరోజు. సరిగ్గా అప్పుడే అతని మీద కాల్పులు జరుగుతాయి. ఆ కాల్పుల్లో వసంత్ చనిపోతాడు. ఎన్నాళ్లయినా ఆ షాక్ నుంచి అతని తల్లిదండ్రులు, పీటర్, మధుబాల కోలుకోలేకపోతారు. ఆ పరిస్థితుల్లో హఠాత్తుగా వాళ్ల ముందు వసంత్ ప్రత్యక్షం అవుతాడు.
వసంత్ ప్రాణాలతో తిరిగొచ్చాడనే ఆనందిస్తున్న వాళ్లకు మరో షాక్ కిస్మత్ అనుచరులు వసంత్ను కిడ్నాప్ చేయడంతో తగులుతుంది. అంతకుముందు బెట్టింగ్ వల్ల యూసఫ్ అక్తర్ పోగొట్టుకున్న వెయ్యికోట్ల గురించి అడుగుతాడు కిస్మత్. ఆ డబ్బు వచ్చింది తన ఎకౌంట్ కేనని వసంత్ చెప్తాడు. ‘‘ఆ డబ్బును వసూలు చేసే బాధ్యత యూసఫ్ నాకు అప్పగించాడు. ఆ పని నేను చేయలేకపోతే అతనే రంగంలోకి దిగుతాడు. ఈ మాటలు నిర్లక్ష్యం చేస్తే నీ ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడుతుంది” అని బెదిరిస్తాడు వసంత్‌ని. దాంతో ఎక్కడ? ఏం జరుగుతుంది? అనేది ముందుగానే తెలుసుకుని యూసఫ్ అడిగిన డబ్బు ఇచ్చేస్తాడు వసంత్ . కానీ ఆ డబ్బు సరిపోలేదని అతనే నేరుగా రంగంలోకి దిగుతాడు. అప్పుడు వసంత్ ఏం చేస్తాడు? అసలు అతను ఎలా బతికాడు? దురాశకుపోయిన యూసఫ్కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనేది మిగతా కథ.