- టీ20 వరల్డ్‌కప్‌పై ఐసీసీ
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకునేందుకు ఓ నెల రోజుల టైమ్ కావాలన్న బీసీసీఐ విజ్ఞప్తికి.. ఐసీసీ సానుకూలంగా స్పందించింది. ఈ నెల 28 వరకు టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయానికి రావాలని గడువు ఇచ్చింది. మంగళవారం జరిగిన వర్చువల్ మీటింగ్‌కు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీతో పాటు సెక్రటరీ జై షా హాజరయ్యారు. ఈ ఇద్దరు చేసిన విజ్ఞప్తికి ఐసీసీ బోర్డు ఏకగ్రీవంగా ఓకే చెప్పింది. ‘బీసీసీఐ అభ్యర్థనను ఐసీసీ బోర్డు మన్నించింది. వాళ్లకు ఈ నెల 28 వరకు గడువు ఇచ్చింది. ఆ లోగా మెగా టోర్నీపై ఓ నిర్ణయానికి రావాలి. వారి నిర్ణయం తర్వాత వచ్చే నెలలో జరిగే మీటింగ్‌కు ఐసీసీ ఓ పకడ్బందీ ప్లాన్‌తో వస్తుంది’ అని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. ఒకవేళ ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు ఉంటే.. టోర్నీని యూఏఈకి షిఫ్ట్ చేసే ఆలోచన చేస్తామన్నారు. మరోవైపు 2023–2031 సైకిల్‌లో మరో నాలుగు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌లను నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించింది. దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా టెస్ట్‌లకు మరింత ఆదరణ పెరుగుతుందని ఇంటర్నేషనల్ బాడీ భావిస్తోంది. 2027 నుంచి వన్డే వరల్డ్‌కప్‌ను 14 టీమ్స్‌తో నిర్వహించనున్నారు. ఎఫ్‌టీపీలో భాగంగా.. ప్రతి రెండేళ్లకు ఓసారి టీ20 వరల్డ్‌కప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ‘ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌లో 14 టీమ్‌లకు చోటు కల్పిస్తున్నాం. 2027 ఎడిషన్ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. మెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లోనూ టీమ్‌ల సంఖ్య 20కి పెంచుతున్నాం. 2024 నుంచి 2030 వరకు ఇది కొనసాగుతుంది. 2025, 2027, 2029, 2031లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ కమిట్‌మెంట్‌లో భాగంగా విమెన్స్ టోర్నీలను కూడా విస్తరిస్తాం’ అని ఐసీసీ పేర్కొంది.
