U-19 Asia Cup: డబుల్ సెంచరీతో అభిజ్ఞాన్ కుండు వీర విహారం.. 315 పరుగుల తేడాతో మలేషియాను చిత్తు చేసిన టీమిండియా

U-19 Asia Cup: డబుల్ సెంచరీతో అభిజ్ఞాన్ కుండు వీర విహారం.. 315 పరుగుల తేడాతో మలేషియాను చిత్తు చేసిన టీమిండియా

అండర్-19 ఆసియా కప్ 2025లో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. పసికూన మలేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది.  మంగళవారం (డిసెంబర్ 16) దుబాయ్‌లోని 7వ సెవెన్స్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 315 పరుగుల తేడాతో  గెలిచి మలేషియాకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది. వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుండు (125 బంతుల్లో 209) డబుల్ సెంచరీతో శివాలెత్తాడు. బౌలర్లు కూడా చెలరేగి జట్టు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 408 పరుగులు చేసింది. ఛేజింగ్ లో మలేసియా కేవలం 93 పరుగులకే ఆలౌటైంది. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించింది. టీ20 తరహాలో ఆడుతూ చెలరేగారు. అయితే వేగమా ఆడే క్రమంలో ఆయుష్ మాత్రే, విహాన్ మల్హోత్రా వికెట్లను టీమిండియా త్వరగా చేజార్చుకుంది. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది  40 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. ఉన్నంత సేపు వేగంగా ఆడిన వైభవ్..26 బంతుల్లోనే 50 పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో ఇండియా 87 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. అసలు ఆట ఇక్కడ నుంచే ప్రారంభమైంది.

అభిజ్ఞాన్ కుండు, వేదాంత్ త్రివేది రెచ్చిపోయి ఆడారు. వీరిద్దరూ మలేసియా బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. బౌండరీల వర్షం కురిపిస్తూ స్కోర్ కార్డును శరవేగంగా ముందుకు తీసుకెళ్లారు. ముఖ్యంగా కుందు ధాటికి మలేసియా పూర్తిగా చేతులెత్తేసింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 90 పరుగులు చేసిన వేదాంత్ త్రివేది 10 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. అయితే మరో ఎండ్ లో మాత్రం కుండు తాండవం ఆగలేదు. సెంచరీ చేసిన తర్వాత మరింత చెలరేగి ఆడుతూ డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.

ఈ వికెట్ కీపర్ చివరి వరకు తన విధ్వంసం కొనసాగించడంతో ఇండియా స్కోర్ 408 పరుగులకు చేరింది. అభిజ్ఞాన్ కుండు 125 బంతుల్లో 209 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో మలేసియా కనీస పోటా ఇవ్వకుండా దారుణంగా ఓడిపోయింది. దీపేష్ దేవేంద్రన్ 5 వికెట్లతో చెలరేగడంతో ఒక దశలో ప్రత్యర్థి జట్టు 38 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. హంజా పంగి 35 పరుగులు చేసి భారత్ విజయాన్ని కాస్త ఆలస్యం చేశాడు.