సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోండి: గవర్నర్​కు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఫిర్యాదు

సీఎం కేసీఆర్పై చర్యలు తీసుకోండి: గవర్నర్​కు మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ఫిర్యాదు
  • హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిండు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ల్యాండ్, డ్రగ్స్, ఇసుక, మద్యం మాఫియా నడుస్తున్నదని మాజీ ఎంపీ, బీజేపీ నేత రవీంద్ర నాయక్  ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా అన్ని నిర్మాణాల్లో అవినీతి జరిగిందన్నారు. పబ్లిక్​కు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో  కేసీఆర్ విఫలం అయ్యారన్నారు. కేసీఆర్ అవినీతిపై రాజ్యాంగపరంగా  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
“ సౌతిండియా, మహారాష్ట్ర, మధ్య భారత్ బంజారా సేవాలాల్ సమితి ” తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రతినిధులతో కలిసి గవర్నర్ తమిళిసైకు రవీంద్ర నాయక్ ఫిర్యాదు చేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో రవీంద్ర నాయక్ మీడియాతో మాట్లాడారు.  మద్యం రెవెన్యూతో రాష్ట్రాన్ని నడుపుతున్నారని ఫైర్​ అయ్యారు. ఓట్ల కోసం అన్ని వర్గాలకు బంధులు అని ప్రకటిస్తూ కొందరిరే స్కీమ్​లు అమలు చేస్తున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్ అవినీతికి కేరాఫ్​గా మారిందన్నారు. 
జిల్లాలకు వెళ్లినప్పుడు గవర్నర్​కు ప్రొటోకాల్ ఇవ్వకుండా అవమానించారన్నారు. ట్రైబల్ ప్రాంతాల్లోని స్కూళ్లు బంద్ కావడం వల్ల అక్కడి విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్నారు. కేసీఆర్ కంటే తానే సీనియర్ ను అని,  ఓర్వలేక తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశాడన్నారు.  కేసీఆర్ ను జైలుకు పంపే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు.