కేంద్రం ప్యాకేజీ ఒక్కరికైనా అక్కరకొచ్చిందా?

కేంద్రం ప్యాకేజీ ఒక్కరికైనా అక్కరకొచ్చిందా?

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో బీజేపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. వైరస్ కట్టడి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మెచ్చుకున్నారన్న విషయం ఇక్కడి నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో మంగళవారం ఆయన ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్​, ముఠా గోపాల్​తో కలిసి మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తోందంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. కరోనా కట్టడిలో కేంద్రం ఏం చేస్తుందో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా రిలీఫ్ ప్యాకేజీ ఒక్కరికైనా అక్కరకొచ్చిందా? వలస కార్మికులను ఇబ్బందులకు గురిచేసింది మీరు కాదా అంటూ బీజేపీ నేతలపై విమర్శలు చేశారు. కేంద్రం లాక్ డౌన్ ను ఇష్టానుసారంగా ప్రకటించటం సరైన ప్రణాళిక లేకుండా ఎత్తివేయటం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లోని మర్కజ్ సమావేశాల్లో కరోనా ప్రబలితే ఇంటెలిజెన్స్ ఏం చేసిందని మంత్రి తలసాని ప్రశ్నించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని…ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ పాటిస్తోందని స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్నా ఆందోళన అవసరం లేదని చాలా మంది కోలుకుంటున్నారని చెప్పారు. మరణాలకు సంబంధించి ఎవరు ఏ కేసుల్లో చనిపోతున్నారో మీడియా వివరాలు తెప్పించుకోవచ్చని ఇందులో దాచే అవసరం లేదని అన్నారు. అమెరికా లాంటి దేశాల్లోనే కరోనా బాధలు తప్పలేవని గుర్తు చేశారు. ఈ నెల25 న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 150 డివిజన్లలో హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని, మొక్కలు ఉచితంగా అందిస్తామని చెప్పారు.