సనత్​నగర్​లో భారీ మెజార్టీతో హ్యాట్రిక్ గెలుపు ఖాయం : తలసాని శ్రీనివాస్ యాదవ్

సనత్​నగర్​లో భారీ మెజార్టీతో హ్యాట్రిక్ గెలుపు ఖాయం : తలసాని శ్రీనివాస్ యాదవ్
  •     బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ 
  •     సికింద్రాబాద్​లోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో నామినేషన్ దాఖలు

సికింద్రాబాద్, వెలుగు : సనత్​నగర్​లో భారీ మెజార్టీతో మూడోసారి గెలుస్తానని ఆ సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం సికింద్రాబాద్​లోని జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసులో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు వెస్ట్ మారేడ్ పల్లిలోని ఆయన ఇంటి వద్ద ఆలయాల పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్ తన తల్లి లలితాబాయి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు.  

ఆ తర్వాత కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు ఆయనకు బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. వెస్ట్ మారేడ్ పల్లిలోని ఇంటి దగ్గరి నుంచి బన్సీలాల్ పేటలోని జబ్బార్ కాంప్లెక్స్ వద్దకు చేరుకున్న తలసాని.. అక్కడ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి సిటీ లైట్ హోటల్, బాటా, ప్యాట్నీ, హరిహర కళాభవన్ మీదుగా నార్త్ జోన్ జీహెచ్ఎంసీ జోనల్ ఆఫీసు వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. దారిపొడవునా కార్యకర్తల నినాదాలు, డప్పు చప్పుళ్లతో కోలాహలం నెలకొంది. 

రెండు చోట్ల అభిమానులు గజమాలలను భారీ క్రేన్ సాయంతో తలసాని శ్రీనివాస్​కు అలంకరించారు. జోనల్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ సర్కారు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ గెలుపు సాధిస్తారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ బీఆర్ఎస్ ఇన్​చార్జి తలసాని సాయికిరణ్​ యాదవ్, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, కుర్మ హేమలతా, మాజీ కార్పొరేటర్లు నామన శేషకుమారి, అత్తిలి అరుణ, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, వెంకటేశన్ రాజు, కొలన్ బాల్ రెడ్డి పాల్గొన్నారు.