6 సార్లు ఎమ్మెల్యేను..4 సార్లు మంత్రిని కనీస గౌరవం ఉండక్కర్లేదా ? : తలసాని శ్రీనివాస్ యాదవ్

6 సార్లు ఎమ్మెల్యేను..4 సార్లు మంత్రిని  కనీస గౌరవం ఉండక్కర్లేదా ? : తలసాని శ్రీనివాస్ యాదవ్
  •   సీఎం కామెంట్స్​పై  తలసాని ఫైర్​ 

పద్మారావునగర్, వెలుగు: ‘మహంకాళి జాతరకు సీఎం వస్తే  స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రికి గౌరవప్రదంగా స్వాగతం పలికిన.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు మంత్రిగా పనిచేసిన..రాజకీయాల్లో సీనియర్​ను..అయినా..నాపై కనీస గౌరవం లేకుండా  సీఎం మాట్లాడిండు..ఆయన వాడిన భాష  అహంకారానికి నిదర్శనం’ అని మాజీ మంత్రి, సనత్​నగర్​ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్​ యాదవ్​ అన్నారు. సీఎం  నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. గురువారం వెస్ట్ మారేడ్ పల్లి క్యాంప్ ఆఫీస్​లో తలసాని విలేకరులతో మాట్లాడారు. 

సీఎం  అనే విషయాన్ని మరిచి గౌరవం, సంస్కారం లేకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు.  సనత్ నగర్ టిమ్స్​ను తామే కట్టామని చెప్పుకోవడం అవివేకమని,  బీఆర్​ఎస్​  అభివృద్ధి పనులకే ఆయన రిబ్బన్ కటింగ్​లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.  నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించకుండా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, జాబితాలో పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకునేలా చూడాలని సూచించారు.