ఆటో లవర్స్‌కు షాక్: సెప్టెంబర్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెంపు.. ఏడాదిలో 3వ సారి!

ఆటో లవర్స్‌కు షాక్: సెప్టెంబర్ 1 నుంచి టాటా కార్ల ధరలు పెంపు.. ఏడాదిలో 3వ సారి!

కారు కొనుక్కుందాం అనుకుంటున్న ఆటో మొబైల్ లవర్స్‌కు టాటా మోటార్స్ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. పెరుగుతున్న ఇన్‌పుట్ కాస్ట్, ద్రవ్యోల్బణ ఒత్తిడి కారణంగా తన ప్యాసింజర్ వాహనాల రేట్లను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు కూడా సెప్టెంబర్ 1 నుంచి పెంచాలని నిర్ణయించింది. దీంతో కారు మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ పెంపు రూ.25వేల వరకు ఉండనుందని సమాచారం.

ఈ ఏడాది టాటా మోటార్స్ ధరలను పెంచడం ఇది 3వ సారి కావడం ఆందోళన కలిగిస్తోంది కార్లు కొనేవారికి. అంతకుముందు ఏప్రిల్ 1న పెట్రో డీజిల్ కార్లపై 0.5 శాతం, జూలై 1న మొత్తం పోర్ట్‌ఫోలియోపై 1.5 శాతం వరకు ధరలను సవరించింది. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడం.. ఈ ఆర్థిక సంవత్సరం మెుదటి రెండు త్రైమాసికాల్లో ఆటో ఇండస్ట్రీ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఎండీ, సీఈఓ శైలేష్ చంద్ర వెల్లడించారు.

ధరల పెరుగుదల భారాన్ని పూర్తిగా కంపెనీ భరించలేదని, కొంతమొత్తాన్ని కస్టమర్లపైకి మళ్లించక తప్పడం లేదని టాటా మోటార్స్ స్పష్టం చేసింది. అయితే కార్ల ధరలు పెరిగినప్పటికీ.. ప్రతి మోడల్ అందించే ఓవరాల్ వ్యాల్యూ ప్రపోజిషన్ మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. కస్టమర్లపై పడే భారాన్ని తగ్గించేందుకు వీలైనంత వరకు అంతర్గత ఖర్చులను తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పరిశీలిస్తున్నట్లు టాటా మోటార్స్ చెప్పింది. 

టాటా మోటార్స్‌తో పాటు హ్యుందాయ్ ఇండియా కూడా సెప్టెంబర్ 1 నుంచి తన కార్ల ధరలను 1 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాపాతంగా వివిధ దేశాల్లో ఉన్న జియోపొలిటికల్ పరిస్థితులు, ముడిసరుకుల భారం కారణంగానే ఈ ధరల పెంపు తప్పట్లేదని ఆటోమొబైల్ దిగ్గజాలు చెబుతున్నాయి. సో త్వరలో కొత్త కారు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్న ఆటో లవర్స్ ఇకపై జేబుపై అదనపు భారం తప్పదని గుర్తుంచుకోవాలి.