టమాటాలతో కాదు.. యాసిడ్ తో సాస్ తయారు చేస్తున్రు

టమాటాలతో కాదు.. యాసిడ్ తో సాస్ తయారు చేస్తున్రు
  • యాసిడ్​తో సాస్ తయారీ
  • ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ వాడకం
  • సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా
  • శంషాబాద్​లో 772 లీటర్ల కల్తీ సాస్ సీజ్ చేసిన పోలీసులు

శంషాబాద్, వెలుగు: యాసిడ్, కెమికల్స్, సింథటిక్ కలర్స్​తో కల్తీ సాస్, వెనిగర్ తయారు చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్​వోటీ పోలీసులు పట్టుకున్నారు. శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పేరుతో ఈ దందా కొనసాగిస్తున్నట్టు ఆర్​జీఐ పోలీసులు గుర్తించారు. 772 లీటర్ల కల్తీ సాస్, 30 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 13 కేజీల కార్న్​ఫ్లోర్​తో పాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. రాజేశ్ ఉపాధ్యాయ అనే వ్యాపారి శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సింప్లెక్స్ వద్ద శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు. 

అందులో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ సాస్, వెనిగర్ తయారు చేస్తున్నాడు. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండేందుకు వాటిలో యాసిడ్, కొన్ని కెమికల్స్ కలుపుతున్నాడు. కలరింగ్ కోసం కొన్ని సింథటిక్ రంగులు వాడుతున్నాడు. అలా తయారు చేసిన సాస్, వెనిగర్​ను బాటిల్స్​లో నింపి మార్కెట్​లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ ఎస్​వోటీ పోలీసులు సోమవారం సాయంత్రం శ్రీ బాలాజీ ఇండస్ట్రీస్​పై దాడి చేశారు. పెద్ద మొత్తంలో కల్తీ సాస్, వెనిగర్ బాటిల్స్, రసాయనాలు, యాసిడ్ డ్రమ్ములతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

వీటి విలువ రూ.3.50లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎయిర్​పోర్టు పోలీసులు తెలిపారు. కల్తీ సాస్, వెనిగర్ బాటిల్స్ హైదరాబాద్​తో పాటు ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నాడు.. ఎన్ని రోజుల నుంచి ఈ దందా కొనసాగిస్తున్నాడనే విషయాలు తెలుసుకుంటున్నామని వివరించారు. ఎసిటిక్ యాసిడ్ చాలా ప్రమాదకరమని తెలిపారు. వాటితో తయారు చేసిన సాస్‌‌‌‌, ఆహార పదార్థాలు తినడంతో దీర్ఘ కాల వ్యాధుల బారినపడే అవకాశంఉంటుందని హెచ్చరించారు.