అమెరికా రాజకీయాల్లో ఒక భారతీయ మహిళ సరికొత్త చరిత్ర సృష్టించారు. వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో నిలిచిన తొలి దక్షిణాసియా మహిళగా తమిళనాడులో జన్మించిన రిని సంపత్ రికార్డుకెక్కారు. కేవలం ఏడేళ్ల వయస్సులోనే అమెరికన్ డ్రీమ్ ను వెతుక్కుంటూ అక్కడ అడుగుపెట్టిన రిని.. ఇప్పుడు అదే కల సాధారణ పౌరులకు కూడా నిజం కావాలనే లక్ష్యంతో అగ్రరాజ్య రాజధాని మేయర్ పీఠం కోసం పోటీ పడుతున్నారు. మేయర్ అభ్యర్థిగా అర్హత సాధించడానికి అవసరమైన 4వేల500 మందికి పైగా సపోర్టర్ల సంతకాలను ఆమె సేకరించి.. అధికారికంగా ఎన్నికల బరిలో నిలిచారు.
31 ఏళ్ల రిని సంపత్ వృత్తిరీత్యా సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ పూర్తి చేసిన ఆమె.. గత దశాబ్ద కాలంగా వాషింగ్టన్ డీసీలోనే నివసిస్తున్నారు. తమిళనాడులోని తేనిలో జన్మించిన రిని.. తన తాతగారి స్ఫూర్తితోనే ప్రజాసేవలోకి అడుగుపెట్టినట్లు చెప్పారు. తన తండ్రి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వల్లే తమ కుటుంబం అమెరికాకు రాగలిగిందని.. ఆ అవకాశమే తనను బాధ్యతాయుతమైన పౌరురాలిగా తీర్చిదిద్దిందని వెల్లడించారు.
ప్రస్తుత రాజకీయ నాయకులకు భిన్నంగా 'అవుట్ సైడర్' అనే నినాదంతో ఆమె ప్రజల ముందుకు వెళ్తున్నారు. తాను రాజకీయనాయకురాలిని కాదని.. తనకు ఎటువంటి ప్రత్యేక గ్రూపులతో సంబంధం లేదని స్పష్టం చేస్తూ.. వాషింగ్టన్ నగరం ఎదుర్కొంటున్న బేసిక్ సమస్యల పరిష్కారమే తన ధ్యేయమని రిని ప్రకటించారు. 'ఫిక్స్ ది బేసిక్స్' అనే థీమ్‌తో సాగుతున్న ఆమె ప్రచారంలో.. రోడ్లపై గుంతలను పూడ్చడం, పోటోమాక్ నదిలో వ్యర్థాల నివారణ, ధరల నియంత్రణ, 911 ఎమర్జెన్సీ వెయిటింగ్ టైమ్‌ను తగ్గించడం వంటి అంశాలను ఆమె హైలైట్ చేస్తున్నారు.
►ALSO READ | ఇరాన్ భూభాగంలో పడిన అమెరికా పైలట్ ఏం చేస్తాడు.. ఎలా తప్పించుకుంటాడు.. ట్రైనింగ్‌లో ఏం చెబుతారంటే..!
వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల బరిలో రిని సంపత్ ఎదుట గట్టి పోటీ ఉంది. జనీస్ లూయిస్ జార్జ్, కెన్యాన్ మెక్‌డఫీ, గ్యారీ గుడ్‌వెదర్ వంటి హేమాహేమీలతో ఆమె ఎన్నికల్లో ప్రస్తుతం తలపడుతున్నారు. అయినప్పటికీ ఒక భారతీయ సంతతి మహిళగా, అందులోనూ దక్షిణాది మూలాలున్న వ్యక్తిగా ఆమె సాధించిన ఈ విజయం ప్రవాస భారతీయులకు ఎంతో గర్వకారణంగా మారింది. అమెరికా రాజధాని నగర పరిపాలనా పగ్గాలను ఒక భారతీయ మహిళ చేపట్టే రోజు దగ్గర్లోనే ఉందన్న ఆశ ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
