తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత మధ్య కొనసాగుతున్న విడాకుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఇవాళ సోమవారం జూన్ 15, 2026న జరిగిన విచారణకు ఇద్దరూ హాజరుకాకపోవడంతో చెంగల్పట్టు మహిళా కోర్టు ఆగస్టు 7కు విచారణ వాయిదా వేసింది.
ఇంతకుముందు కూడా ఈ కేసు విచారణకు ఇద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. వారి తరఫున న్యాయవాదులు మాత్రమే హాజరయ్యారు. ప్రజాప్రతినిధి హోదా, భద్రతా సమస్యలు, ప్రయాణ సంబంధిత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని ఇరు పక్షాల తరఫున కోర్టును కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత విచారణను జూన్ 15కు వాయిదా వేసిన కోర్టు, తాజాగా మళ్లీ ఆగస్టు 7కు వాయిదా వేసింది.
కాగా, 2025 డిసెంబరులో సంగీత.. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. భర్తతో అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని, విజయ్ ఓ మహిళా నటితో వివాహేతర సంబంధం కొనసాగించారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే భరణం (అలిమనీ) మంజూరు చేయాలని, చెన్నైలోని నీలంకరై నివాసంలోనే కొనసాగి నివసించే హక్కు కల్పించాలని కూడా కోర్టును కోరారు.
తాజా విచారణలో కూడా ఇద్దరూ గైర్హాజరు కావడంతో కేసు మరోసారి వాయిదా పడింది. దీంతో ఈ హైప్రొఫైల్ కేసుపై తదుపరి పరిణామాలు ఆగస్టు 7న జరిగే విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. 1999లో వివాహం చేసుకున్న ఈ జంట, త్వరలో మళ్ళీ కలుస్తారని తమిళ సినీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
విజయ్ తల్లి చొరవతీసుకుని ఈ జంటను కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మరి 27 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలకుతారా? సామరస్యంగా కలిసిపోయి మళ్ళీ కొత్త జీవితం మొదలుపెడతారా అనేడి తెలియాల్సి ఉంది.
