మందు తాగిన అమ్మాయిలు.. కాలేజ్ నుంచి బహిష్కరణ

మందు తాగిన అమ్మాయిలు.. కాలేజ్ నుంచి బహిష్కరణ
  • ఓ అమ్మాయి ఇంట్లో అబ్బాయిలతో కలిసి బర్త్ డే పార్టీ

క్లాస్‌లో ఓ అమ్మాయి బర్త్ డే.. నలుగురు ఫ్రెండ్స్ కలిసి పార్టీ చేసుకుందామనుకున్నారు. తన ఇంటికి వెళ్లిన నలుగురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి మందు తాగారు. ఈ విషయంలో కాలేజ్ మేనేజ్‌మెంట్‌కు తెలియడంతో ఆ నలుగురు అమ్మాయిల్ని కాలేజీ నుంచి బహిష్కరించారు. ఈ ఘటన తమిళనాడులోని నాగపట్నం జిల్లా జరిగింది.

మయిలాదుత్తురైలోని ధర్మపురం ఆధీనం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో చదువుతున్న నలుగురు అమ్మాయిలను బీర్లు తాగినందుకు ప్రిన్సిపాల్ వారిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక అమ్మాయి బర్త్ డే కావడంతో మరో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు కలిసి ఆమె ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారంతా బీర్లు తెచ్చుకుని తాగారు.

వీడియో తీసి.. సోషల్ మీడియాలో పెట్టిన అబ్బాయి..

వారి పార్టీ మొత్తాన్ని ఆ నలుగురు అమ్మాయిలకు తెలియకుండా అక్కడున్న ఓ అబ్బాయి వీడియో తీశాడు. అతడు ఆ బర్త్ డే చేసుకున్న అమ్మాయి బంధువే. వీడియోను అతడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేశాడు. ఇది వైరల్ అయి.. కాలేజ్ మేనేజ్‌మెంట్ దాకా వెళ్లింది. దీంతో ఆ నలుగురు అమ్మాయిల్ని కాలేజ్ నుంచి బహిష్కరించారు. ఆ వీడియోలోని ముగ్గురు అమ్మాయిలు కాలేజ్ యూనిఫామ్‌లో ఉండగా, ఒక అమ్మాయి సివిల్ డ్రస్‌లో ఉంది. అయితే ఆ అబ్బాయిలు మాత్రం కాలేజ్‌తో సంబంధం లేని వాళ్లు.

శాశ్వతంగా కాలేజ్ నుంచి బహిష్కరణ

దాదాపు ఆరు వారాల క్రితం జరిగిన ఈ ఘటన డిసెంబరు 24న కాలేజీ యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనిపై ఆ అమ్మాయిల పేరెంట్స్‌ని పిలిచి మాట్లాడారు ప్రిన్సిపాల్. అయితే ఈ ఘటన కాలేజీలో జరగకపోయినా, వాళ్లు యూనిఫామ్‌లో ఉన్నందున బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2వ తేదీ నుంచి వాళ్లు కాలేజీకి రాకూడదని చెప్పారు. తమ కాలేజీ ఓ మఠం ఆధ్వర్యంలో నడిచేదని, మంచి విలువలతో కూడిన విద్యనందిస్తామన్న పేరు తమకు ఉందని చెప్పారు ప్రిన్సిపాల్. కానీ వీరి పనివల్ల కాలేజీ పరువు పోయి.. మిగిలిన విద్యార్థుల్లోనూ తేలిక భావం రాకుండా ఉండడానికే వారిని సస్పెన్షన్ కాకుండా బహిష్కరణ చేశామన్నారు.

ఇదిలా ఉండగా, లిక్కర్ తీసుకోవడానికి చట్టప్రకారం కనీసం 21 ఏళ్లు నిండాలి. కానీ వాళ్లు నలుగురు అమ్మాయిలూ 18 ఏళ్ల వయసు వారే. గతంలోనూ ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.

More News

ట్రాఫిక్ ఆంక్షలు : రాత్రి 10 గంటల నుంచి సిటీలో ఫ్లై ఓవర్స్ క్లోజ్