తమిళనాడులో గవర్నర్ వెనక్కి పంపిన.. 10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

తమిళనాడులో గవర్నర్ వెనక్కి పంపిన..  10 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

చెన్నై: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి పంపిన 10 బిల్లులను ఆ రాష్ట్ర అసెంబ్లీ శనివారం మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లులపై చర్చ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా బిల్లులను ఆపడం ప్రజాస్వామ్యంలో చెల్లదన్నారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాల కారణంగా బిల్లులను గవర్నర్ వాపస్ పంపారని, ఆమోదం తెలపలేదని విమర్శించారు. ఇది ప్రజా వ్యతిరేకమని అన్నారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలను గవర్నర్ల ద్వారా కేంద్రం టార్గెట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. చర్చ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. 

ఆ పది బిల్లులు ఇవే.. 

మూడేండ్ల కిందటి ఒక బిల్లు, కిందటేడాదివి మరో ఆరు బిల్లులు, ఈయేడు ప్రారంభంలో ఇంకొన్ని.. ఇలా మొత్తం 10 బిల్లులను రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్​కు పంపింది. అందులో రాష్ట్ర యూనివర్సిటీలకు వైస్‌‌-చాన్స్ లర్‌‌ల నియామకంలో గవర్నర్ అధికారాలను తొలగించే బిల్లు కూడా ఉంది. యూనివర్సిటీలపై గవర్నర్​కు ఉన్న అధికారాలను తొలగించేలా చట్ట సవరణ చేస్తూ బిల్లును ఆమోదించింది.

 మిగతా వాటిలో నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు, అన్నా డీఎంకే హయాంలో పనిచేసిన మంత్రులపై విచారణకు అనుమతి, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై బ్యాన్ వంటి బిల్లులున్నాయి. వీటన్నింటినీ గవర్నర్ తిప్పి పంపలేదు, ఆమోదించనూ లేదు. దీంతో స్టాలిన్ సర్కారు ఈ నెల 10న సుప్రీం కోర్టుకెక్కింది. విచారించిన కోర్టు.. బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని గవర్నర్​ను ఆదేశించింది. దీంతో తాజాగా గవర్నర్ వాటన్నింటినీ వచ్చినట్టుగానే రిటర్న్ చేశారు. దీంతో స్టాలిన్ సర్కారు ఆ బిల్లులకు మరోసారి అసెంబ్లీ ఆమోదం పొందింది.