మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ పెంపు

మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ లీవ్స్ పెంపు

తమిళనాడు: మహిళా ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవుల కాలపరిమితిని పెంచుతూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న తొమ్మిది నెలల సెలవులను 12 నెలలకు పెంచింది. ఈ విషయాన్ని ఆగష్టు 13న తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. ఇద్దరు కంటే తక్కువ మంది పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగులకు 12 నెలల వేతనంతో కూడిన సెలవు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ నిబంధన జూలై 1, 2021 నుంచి పరిగణనలోకి తీసుకోబడుతుందని ఆయన చెప్పారు. ఈ నిబంధన 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు డీఎంకే ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒకటి కావడం గమనార్హం.

ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం తమిళనాడు ఆర్థిక మంత్రి ఇతర పథకాలను కూడా ప్రకటించారు. సర్వీస్‌లో ఉన్నప్పుడు మరణించిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి కుటుంబ సెక్యూరిటీ ఫండ్ నుంచి ఇచ్చే లంప్సమ్ గ్రాంట్‌ను రూ .5 లక్షలకు పెంచారు. గతంలో ఈ గ్రాంట్ రూ. 3 లక్షలుగా ఉండేది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే డియర్‌నెస్ అలవెన్స్ పెరుగుదల ఏప్రిల్ 1, 2022 నుండి వర్తిస్తుందని బడ్జెట్ లో ప్రకటించారు.