- రెస్టారెంట్లు, హోటళ్లు, టీ స్టాల్స్‌కు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం
చెన్నై: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత రోజురోజుకు తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్లకు బదులు ఎలక్ట్రిక్ స్టవ్ (ఇండక్షన్)లను ఉపయోగిస్తే.. రెస్టారెంట్లు, హోటళ్లు, టీ స్టాల్స్‌కు యూనిట్ విద్యుత్‌పై రూ.2 సబ్సిడీ ఇవ్వనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రకటించింది.
ఫిబ్రవరి 28న పశ్చిమాసియాలో ఘర్షణలు మొదలైనప్పటి నుంచి హోటళ్లకు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందని, దీనిపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రభుత్వం తెలిపింది. శనివారం జరిగిన సమీక్ష సమావేశంలో.. ఇండక్షన్ స్టవ్‌లను ఉపయోగించే రెస్టారెంట్లు, హోటళ్లు, టీ షాపులు, క్లౌడ్ కిచెన్‌లకు వచ్చే అదనపు విద్యుత్‌పై యూనిట్‌కు రూ.2 చొప్పున సబ్సిడీ అందించనున్నట్టు నిర్ణయించారు.
కేంద్రం ప్రకటించిన కమర్షియల్ ఎల్‌పీజీ వినియోగ ఆంక్షలు అమలులో ఉన్నంత కాలం ఈ సబ్సిడీ వర్తిస్తుందని అడిషనల్చీఫ్ సెక్రటరీ అదనపు ప్రధాన కార్యదర్శి జె. రాధాకృష్ణన్ సెక్రటేరియెట్‌లో మీడియాతో తెలిపారు.
