నీట్లో రెండు సార్లు ర్యాంకు.. డబ్బుల్లేక వ్యవసాయం

నీట్లో రెండు సార్లు ర్యాంకు.. డబ్బుల్లేక వ్యవసాయం

ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. ప్రతిభ ఉండి.. మెరుగైన ర్యాంకులు సాధించినప్పటికీ..  డబ్బుల్లేక పై చదువుల్లో చేరలేకపోతున్నారు. ఇలాంటి కథే.. తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థినిది. మధురైలోని పనమూప్పన్ పట్టి గ్రామానికి చెందిన తంగపాచి అనే విద్యార్థిని నీట్ లో ర్యాంక్ సాధించి వ్యవసాయం చేస్తోంది. ప్రభుత్వం తన ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తోందని.. దీంతో వసతి, భోజనం ఇతర ఖర్చులకు డబ్బుల్లేక.. ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తున్నానని తంగపాచి చెబుతోంది. ప్రభుత్వమే తనకు సహాయం చేయాలని కోరుతోంది. 

తంగపాచి 2021, 2022 విద్యా సంవత్సరంలో వరుసగా NEET పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె తండ్రి ఓ రైతు. వ్యవసాయం చేస్తున్నప్పటికీ  తన నలుగురు పిల్లలను చదివించుకుంటున్నాడు. వారిలో, తంగపాచి పెద్దది, ఆమె 2020లో విక్రమంగళం కల్లార్ హైస్కూల్ నుండి తన హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించింది. 2021 ,2022లో నీట్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. 

మెడిసిన్ చదవడానికి ఖర్చులు ఎక్కువగా ఉండడంతో పాటు ఆమె ట్యూషన్ ఫీజు, వసతి, భోజనం ఖర్చులు కుటుంబం భరించలేక గతేడాది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తంగపాచి చేరలేకపోయింది. దీంతో ఆమెకు ఈసారి కన్యాకుమారిలోని మూకాంబిక మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివే అవకాశం వచ్చింది. అయినా కూడా ఆమె చదువుకు అయ్యే ఖర్చులను కుటుంబం భరించలేక వ్యవసాయం చేస్తోంది. ప్రభుత్వమే తన మెడిసన్ చదువుకు ఆర్థిక సాయం చేయాలని.. తంగపాచి కోరుతోంది.