హుస్సేన్​సాగర్ క్లీన్​ చేయాలి.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి : తమిళిసై

హుస్సేన్​సాగర్  క్లీన్​  చేయాలి.. ప్రభుత్వం వెంటనే స్పందించాలి : తమిళిసై

హుస్సేన్​సాగర్  క్లీన్​  చేయాలి
ప్రభుత్వం వెంటనే స్పందించాలి : తమిళిసై
సెయిలింగ్ ముగింపు వేడుకల్లో కామెంట్

హైదరాబాద్, వెలుగు : హుస్సేన్​సాగర్ హైదరాబాద్ నగరానికి గిఫ్టెడ్​లేక్ అని, దాన్ని క్లీన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై అన్నారు. అలాగే, సాగర్​ను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత పబ్లిక్​పై కూడా ఉంటుందని తెలిపారు. ఒకప్పుడు హుస్సేన్​సాగర్ ఎంతో క్లీన్​గా ఉండేదని అధికారులు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. వీలైనంత త్వరగా క్లీనింగ్ చర్యలు ప్రారంభించాలన్నారు. ఆదివారం హుస్సేన్​సాగర్ దగ్గర సెయిలింగ్ ముగింపు వేడుకలకు గవర్నర్ తమిళిసై చీఫ్ గెస్ట్​గా హాజరై మాట్లాడారు.

‘‘గతంలో సెయిలింగ్ చేసేటప్పుడు పాములు, కప్పలు కనబడేవని నిర్వాహకులు చెప్పారు. పెరిగిన పొల్యూషన్ కారణంగా ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇక్కడకొచ్చి ఈవెంట్స్​లో పాల్గొంటున్నారు. ఇంతపెద్ద ఈవెంట్ నిర్వహించినందుకు అసోసియేషన్​కు ధన్యవాదాలు”అని గవర్నర్ తెలిపారు. 93మంది ప్లేయర్లలో 17 మంది అమ్మాయిలు పాల్గొనడం గర్వకారణమన్నారు. మహిళలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. సెయిలింగ్ అనేది ఒక గేమ్ మాత్రమే కాదని, మన జీవితంలో ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తుందన్నారు. ఏషియన్స్, ఒలింపిక్స్ లోను మెడల్స్ తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీజేపీ నేత మురళీధర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.