- స్టేషన్లోనే హత్య కేసు నిందితురాలి ఆత్మహత్యాయత్నం
- పరిస్థితి విషమం.. రహస్యంగా హైదరాబాద్‌కు తరలింపు
- మొన్నటికి మొన్న సంకెళ్లతో ఓ కిడ్నాపర్ పరార్
తాండూరు, వెలుగు: వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన ఇద్దరు మహిళల దారుణ హత్య కేసులో ఓ నిందితురాలు.. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్, యాలాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మిస్సింగ్కేసులుగా నమోదై, ఆ తర్వాత హత్యలుగా తేలిన ఈ కేసులకు సంబంధించి నిందితులు రెహమాన్, కరీంబీ, నయీమ్‌ను.. తాండూరు పోలీసులు శనివారం చేవెళ్ల పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకుని కరన్‌కోట్ (తాండూరు రూరల్) పోలీస్ స్టేషన్లో ఉంచారు. అర్ధరాత్రి సమయంలో నిందితురాలు కరీంబీ వాష్‌రూంకు వెళ్లొస్తానని చెప్పి, అక్కడ క్లీనింగ్ కోసం ఉంచిన యాసిడ్ తాగింది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో తొలుత వికారాబాద్ ఆసుపత్రికి, ఆపై హైదరాబాద్‌లోని నిమ్స్ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచడం గమనార్హం.
మొన్నటికి మొన్న ఓ బాలిక కిడ్నాప్ కేసు నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి సంకెళ్లతోనే పరారై పరువు తీయగా, తాజాగా హత్య కేసు నిందితురాలు ఏకంగా స్టేషన్ లోపలే యాసిడ్ తాగడం పోలీసుల పర్యవేక్షణ లోపానికి, బాధ్యతారహిత్యానికి అద్దం పడుతోంది. నిందితులను పట్టుకోవడంలో సఫలం అవుతున్న స్థానిక పోలీసులు.. నిందితుల జాగ్రత్తల విషయంలో దారుణంగా విఫలమవుతున్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నిందితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించడంతో, మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె నుంచి మరణవాంగ్మూలం (డైయింగ్ డిక్లరేషన్) రికార్డు చేసినట్లు సమాచారం.
