సీపీఎస్‌‌ను రద్దు చేయండి: తపస్ యూనియన్‌‌ నేతల విజ్ఞప్తి

సీపీఎస్‌‌ను రద్దు చేయండి:  తపస్ యూనియన్‌‌ నేతల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడంతో పాటు ఏకీకృత సర్వీసెస్ కోసం లీగల్‌‌ సమస్యలను పరిష్కరించాలని తపస్ (తెలంగాణ ప్రాంత టీచర్ల సంఘం) రాష్ట్ర అధ్యక్షుడు హనుమంతరావు డిమాండ్ చేశారు. 2004 కంటే ముందు నియామక ప్రక్రియ ప్రారంభమై, 2004 తర్వాత నియమితులైన వారికి పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ తీసుకొచ్చిన మెమో నంబర్ 57/5/2021పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత కార్యదర్శులకు మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. ఈ క్రమంలో గత మూడ్రోజుల నుంచి ఢిల్లీలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల ఎంపీలకు వినతిపత్రాలు ఇచ్చామని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, సోయం బాపురావు, బండి సంజయ్ ధర్మపురి అర్వింద్‌‌, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రాలు అందజేశామని ఆయన తెలిపారు.
పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి, బీఆర్‌‌‌‌ఎస్ ఎంపీ సురేశ్‌‌ రెడ్డిలను సైతం కలిశామని చెప్పారు. సంసద్‌‌ పరిచయ్‌‌ కార్యక్రమంలో భాగంగా ఎంపీలను కలుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీఆర్‌‌‌‌ఎస్‌‌ఎం(అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిస్ మహాసంఘ్) ప్రతినిధి సూరం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ అయిలినేని నరేందర్ రావు, జనరల్‌‌ సెక్రటరీలు బండి రమేశ్‌‌, తెల్కలపల్లి పెంటయ్య, కరణం లక్ష్మీకాంతారావు, వొద్నాల రాజశేఖర్, వీరమల్ల వెంకట రమణారావు, దుబాశి భాస్కర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.