డైరెక్టర్ కం యాక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన రీసెంట్ మూవీ ‘గాయపడ్డ సింహం’(Gayapadda Simham). ‘నవ్వకండి.. ఇది చాలా సీరియస్ మేటర్’ అనేది ట్యాగ్‌లైన్. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి హీరోయిన్స్. శ్రీవిష్ణు కీలక పాత్రలో నటించాడు. కశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ చిత్రం (మే1, 2026న) థియేటర్లలో విడుదలైంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌పై పగ తీర్చుకోవాలనే ఒక వింత పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ, మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే మూవీ నెలరోజుల లోపే ఓటీటీలోకి అడుగుపెట్టి సర్ప్రైజ్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ మూవీ అందుబాటులోకి వచ్చింది.
#GaayapaddaSimham (Telugu)
— OTT Trackers (@OTT_Trackers) May 22, 2026
Now streaming on PrimeVideo in Telugu, Tamil, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/PvIoBrlINF
‘గాయపడ్డ సింహం’ స్టోరీ:
దరహాస్ (తరుణ్ భాస్కర్) ఒక సాదాసీదా మధ్యతరగతి కుర్రాడు. ఎలాగైనా డల్లాస్ వెళ్లి డాలర్లు సంపాదించి లైఫ్ సెటిల్ చేసుకోవాలనేది అతని కల. కానీ, అప్పట్లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకున్న కొన్ని కఠినమైన వీసా నిబంధనల వల్ల దరహాస్ అమెరికా ఎయిర్‌పోర్ట్ నుంచే వెనక్కి పంపబడతాడు. తన కెరీర్ నాశనం కావడానికి ట్రంపే కారణమని భావించిన దరహాస్, అతనిపై తీవ్రమైన పగ పెంచుకుంటాడు.
మామూలుగా అయితే ఎవరైనా కోర్టుకు వెళ్తారు లేదా సోషల్ మీడియాలో తిడతారు. కానీ మన దరహాస్ మాత్రం వెరైటీగా ట్రంప్‌పై ‘బ్లాక్ మ్యాజిక్’ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం అతను మరో వింతైన వ్యక్తిని (శ్రీవిష్ణు) కలుస్తాడు. ఈ క్రేజీ మిషన్‌లోకి బ్రూటల్ ధర్మ (జె.డి. చక్రవర్తి) ఎలా వచ్చాడు? యూట్యూబర్ శాలిని (ఫరియా అబ్దుల్లా) ఎలా తోడైంది? అసలు హైదరాబాద్ గల్లీలో కూర్చుని వైట్ హౌస్ ప్రెసిడెంట్‌పై చేసిన మంత్రతంత్రాలు పనిచేశాయా? చివరికి దరహాస్ పగ తీరిందా? అన్నదే ఈ సినిమా కథ.
ఎలా ఉందంటే?
రచయిత సూర్య ప్రకాశ్ జోశ్యుల అందించిన కథ నిజంగా చాలా వినూత్నంగా ఉంది. ఒక దేశాధ్యక్షుడిపై సామాన్య భారతీయుడు చేతబడి ద్వారా యుద్ధం ప్రకటించడం అనేది టాలీవుడ్‌లో ఇప్పటివరకు రాని ఐడియా. ప్రథమార్ధంలో పాత్రల పరిచయం, తరుణ్ భాస్కర్ కామెడీ టైమింగ్, డల్లాస్ వెళ్లాలనే తపనతో సాగే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా శ్రీవిష్ణు పాత్ర ప్రవేశించినప్పుడు కథలో వినోదం రెట్టింపు అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఇంత క్రేజీ ఐడియాను రెండు గంటల పాటు ఆసక్తికరంగా నడిపించడంలో స్క్రీన్ ప్లే తడబడిందన్న టాక్ వినిపిస్తోంది. ద్వితీయార్ధంలో కథనం గాడి తప్పింది. బ్లాక్ మ్యాజిక్ చుట్టూ తిరిగే సన్నివేశాలు సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇక థియేటర్లో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న సింహం.. ఓటీటీలో ఎలా గర్జిస్తుందో చూడాలి.
