పేపర్​ లీకేజీలో కేసీఆర్​ ఫ్యామిలీని విచారించాలి: తరుణ్​ చుగ్

పేపర్​ లీకేజీలో కేసీఆర్​ ఫ్యామిలీని విచారించాలి: తరుణ్​ చుగ్

హైదరాబాద్​, వెలుగు: టీఎస్​పీఎస్సీని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర సర్కారును బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ వ్యవహారాల ఇన్​చార్జి తరుణ్​ చుగ్​ డిమాండ్​ చేశారు. లీకేజీ వ్యవహారంలో కమిషన్​ సభ్యులను సస్పెండ్​ చేయాలని, ఈ కేసుపై సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని శనివారం ఓ ప్రకటనలో  ఆయన కోరారు. 30 లక్షల మంది నిరుద్యోగులు రాత్రింబవళ్లూ కష్టపడి ఉద్యోగాల కోసం ప్రిపేర్​ అయితే, వారి ఆశలపై కేసీఆర్  సర్కారు నీళ్లు చల్లిందన్నారు. లీకేజీ ఘటనలో సీఎం కేసీఆర్​ కుటుంబం పాత్రపైనా విచారణ జరిపించాలన్నారు. ‘‘కేసీఆర్​ ఫ్యామిలీ రాష్ట్రంలో ఓ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది.

వాటన్నింటినీ బయటపెట్టాల్సిన సమయం వచ్చింది. పేపర్ల లీకేజీ విషయం బయటకు వచ్చినప్పటి నుంచి కేసీఆర్​ కావాలనే సైలెంట్​ అయ్యిండు” అని తరుణ్  వ్యాఖ్యానించారు. కాగా, పంజాబ్​ మంత్రి హర్భజన్​ సింగ్​పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర గవర్నర్​, కేంద్ర ఎన్నికల సంఘానికి తరుణ్​ చుగ్​ ఫిర్యాదు చేశారు. జలంధర్​ లోక్​సభ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీని కించపరిచేలా పోస్టర్లు అతికించారని, అది ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించడమే అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో గవర్నర్​ జోక్యం చేసుకుని హర్భజన్​ సింగ్​ను పదవి నుంచి తప్పించాలని, ఎన్నికల సంఘం క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.