హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు హాస్పిటళ్ల దోపిడీని అరికట్టడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆరోగ్యశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రతి జోన్‌కు ఓ టీమ్ చొప్పున, మొత్తం 7 టాస్క్‌ఫోర్స్‌లను నియమించింది. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లోని ప్రతి నియమాన్ని ప్రైవేటు హాస్పిటళ్లు పాటించేలా చేస్తామని, ఇందుకోసమే టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు అధికారులు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. ప్రతి టాస్క్‌ఫోర్స్‌లో హెడ్ ఆఫీసు నుంచి ఉన్నతాధికారులు, జిల్లాల్లో పనిచేసే అధికారులు, డాక్టర్లు ఉండేలా టీమ్‌లను కూర్పు చేశారు. ఈ టాస్క్‌ఫోర్స్‌లు ప్రైవేటు హాస్పిటళ్లలో తనిఖీలు చేస్తూ, చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, ప్రభుత్వ దవాఖాన్లలో కూడా చట్ట ప్రకారం అన్ని వసతులు ఉండేలా తనిఖీలు చేపడుతాయంటున్నారు. రాష్ట్ర స్థాయిలో మంత్రి కింద పనిచేసేలా మరో టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఫుడ్ సేఫ్టీ యాక్ట్, డ్రగ్స్ కంట్రోల్ యాక్ట్ అమలుకు కూడా వేర్వేరుగా టాస్క్‌ఫోర్స్ టీమ్‌లను నియమించబోతున్నారు.
