విస్ట్రన్​తో టాటా గ్రూప్ చర్చలు.. జేవీని ఏర్పాటు చేసే చాన్స్

విస్ట్రన్​తో టాటా గ్రూప్ చర్చలు.. జేవీని ఏర్పాటు చేసే చాన్స్

న్యూఢిల్లీ:మనదేశంలోనే యాపిల్​ కంపెనీ ఐఫోన్లను తయారు చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇందుకోసం ఎలక్ట్రానిక్స్ మానుఫ్యాక్చరింగ్​ జాయింట్ వెంచర్‌‌ను స్థాపించడానికి యాపిల్ కాంట్రాక్ట్​ మానుఫ్యాక్చరర్ విస్ట్రన్​తో భేటీలు జరుపుతోంది​. టెక్నాలజీ మానుఫ్యాక్చరింగ్​ సెక్టార్​లో మరింత దూసుకెళ్లాలనేది టాటాల టార్గెట్​! ప్రొడక్షన్ డెవెలప్​మెంట్​, సప్లై చెయిన్,​  అసెంబ్లింగ్‌‌లో ఈ తైవాన్ కంపెనీ  నైపుణ్యాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నదని ఈ సంగతి తెలిసిన వాళ్లు  తెలిపారు. ఈ ఒప్పందం విజయవంతమైతే, ఐఫోన్‌‌లను తయారు చేసిన మొదటి భారతీయ కంపెనీగా టాటా రికార్డులకు ఎక్కుతుంది. ప్రస్తుతం యాపిల్​ ప్రొడక్టులను ప్రధానంగా విస్ట్రన్,  ఫాక్స్‌‌కాన్ టెక్నాలజీ గ్రూప్ వంటి తైవాన్ కంపెనీలు చైనా,  ఇండియాలో అసెంబుల్ చేస్తున్నాయి.

కోవిడ్ లాక్‌‌డౌన్‌‌లు,  అమెరికాతో గొడవల కారణంగా ఎలక్ట్రానిక్స్ తయారీలో చైనా ఆధిపత్యం ప్రమాదంలో పడింది. విస్ట్రన్​, టాటాలు ఒక్కటైతే ఎలక్ట్రానిక్​ ప్రొడక్టుల కోసం ఇండియా డ్రాగన్​పై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలు కొంత వరకు సక్సెస్​ అవుతాయి. ఇంతేగాక విస్ట్రన్​ వంటి మరిన్ని కంపెనీలు ఇండియా కంపెనీలతో కలసి పనిచేసే అవకాశాలు ఉంటాయి. విస్ట్రన్​తో ఒప్పందం, వాటాలు వంటి వివరాలు ఇంకా ఖరారు కాలేదని, చర్చలు కొనసాగుతున్నాయని టాటా వర్గాలు తెలిపాయి.

విస్ట్రన్​  ఇండియా కార్యకలాపాలలో టాటా ఈక్విటీని కొనుగోలు చేయవచ్చు లేదా కంపెనీలు కొత్త అసెంబ్లీ ప్లాంట్‌‌ను నిర్మించవచ్చని పేర్కొన్నాయి. ఈ రెండూ జరిగే అవకాశాలనూ కొట్టిపారేయలేమని అన్నాయి.  చైనా వెలుపల ప్రొడక్షన్​ పెంచాలని,  భారతదేశంలో సప్లై చెయిన్​ను విస్తరించాలని అమెరికా టెక్ కంపెనీ యాపిల్​కోరుకుంటోంది. టాటాతో విస్ట్రన్​తో జరుపుతున్న చర్చల గురించి యాపిల్​కు తెలుసా లేదా అన్నది స్పష్టంగా తెలియలేదు. యాపిల్ తన తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రాంతాలలో స్థానిక కంపెనీలతో కలిసి పని చేస్తుందని అంటారు. 

ఐఫోన్ల తయారీ చాలా కష్టం..

ఐఫోన్లను అసెంబ్లింగ్ చేయడం చాలా కష్టతరమైన పని. ఇందుకు చాలా ప్రమాణాలను, క్వాలిటీ కంట్రోల్స్​ను, డెడ్​లైన్స్​ను పాటించాలి. ఐఫోన్ల తయారీ కోసం టాటాలతో చర్చిస్తున్నారా ? అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వడానికి విస్ట్రన్​తో పాటు యాపిల్​ ఒప్పుకోలేదు.​ టాటా నుంచి కూడా రెస్పాన్స్​ రాలేదు.  భారతదేశంలోని విస్ట్రన్​ ప్లాంట్ల కెపాసిటీని ఐదు రెట్లు పెంచడం  కొత్త వెంచర్ లక్ష్యమని తెలుస్తున్నది. ఒప్పందం ఫలితంగా టాటాలకు విస్ట్రన్​ బిజినెస్​లో వాటాను పొందే అవకాశం ఉంటుంది. ఈ విషయమై ఇటీవల టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్,  హైటెక్ తయారీ.. కంపెనీకి కీలకమైన రంగాలని అన్నారు.  

సుమారు  128 బిలియన్​ డాలర్ల ఆదాయంతో టాటా భారతదేశపు టాప్​ కంపెనీల్లో ఒకటి. సాఫ్ట్‌‌వేర్, స్టీల్,  కార్లు వంటి ఎన్నో  పరిశ్రమలు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలో ఐఫోన్ల కోసం​ ఛాసిస్, ఇతర భాగాలను తయారు చేయడం ద్వారా స్మార్ట్‌‌ఫోన్ సప్లై చెయిన్​లోకి అడుగుపెట్టింది. అయితే విస్ట్రన్ భారతీయ వ్యాపారం ప్రస్తుతం లాభసాటిగా లేదు. టాటాతో ఒక ఒప్పందానికి వస్తే ఇండియాలో దీనికి బలమైన లోకల్​ పార్ట్​నర్ ​దొరికినట్టు అవుతుంది. విస్ట్రన్ 2017లో భారతదేశంలో ఐఫోన్‌‌లను తయారు చేయడం ప్రారంభించింది.

తైపీకి చెందిన ఈ కంపెనీ ప్రస్తుతం కర్ణాటకలోని తన ప్లాంట్‌‌లో ఐఫోన్‌‌లను అసెంబుల్ చేస్తున్నది. లోకల్​గా చిప్స్​, స్మార్ట్​ఫోన్స్​ వంటి ఎలక్ట్రానిక్స్​ ప్రొడక్టుల తయారీని పెంచడానికి మోడీ ప్రభుత్వం కంపెనీలకు పీఎల్​ఐ కింద పలు ఇన్సెంటివ్స్​ను ఇస్తోంది. దీంతో విస్ట్రన్​తోపాటు ఫాక్స్​కాన్, పెగాట్రాన్ ​గ్రూపులు ఇండియాకి వచ్చాయి. వీటి ప్లాంట్లలో యాపిల్​ క్వాలిటీ కంట్రోల్స్​కు తగ్గట్టుగా పనిచేయడం కష్టమనే వాదనలు ఉన్నాయి. తక్కువ జీతాలకు పనిచేయిస్తున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై కార్మికులు రెండుమూడుసార్లు తిరుగుబాటు కూడా చేశారు.  ఇదిలా ఉంటే, యాపిల్ బుధవారం లాంచ్​ చేసిన ఐఫోన్​ 14 ​ వచ్చే క్వార్టర్​ నుంచి ఇండియాలోనూ తయారవుతుంది. మేడ్- ఇన్ -ఇండియా యూనిట్లు డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తాయని  అంచనా. చెన్నై సమీపంలోని ఫాక్స్‌‌కాన్‌‌ ఫ్యాక్టరీలో వీటిని తయారు చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.