51 శాతం తగ్గిన టాటా మోటార్స్ లాభం.. నాలుగో క్వార్టర్లో రూ.8,556 కోట్లు

51 శాతం తగ్గిన టాటా మోటార్స్ లాభం.. నాలుగో క్వార్టర్లో రూ.8,556 కోట్లు

న్యూఢిల్లీ: టాటా మోటార్స్​నికరలాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో 51 శాతం తగ్గి రూ.8,556 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో రూ.17,528 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్​) సాధించామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్​లో దాదాపు రూ.9,000 కోట్ల ‘వాయిదా పడిన పన్ను ఆస్తి’ కారణంగా అధిక లాభాన్ని నమోదు చేసింది. ఈసారి అలాంటివి లేకపోవడంతో లాభం గణనీయంగా తగ్గింది.

కార్యకలాపాల ద్వారా వచ్చే మొత్తం ఆదాయం రూ.1,19,503 కోట్లుగా ఉంది. గత సంవత్సరం ఇదే కాలంలో రూ.1,19,033 కోట్లు వచ్చాయి. 2024–-25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి,  నికర లాభం రూ.28,149 కోట్లుగా ఉంది. గత సంవత్సరం రూ.31,807 కోట్లు వచ్చాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 4,39,695 కోట్లు కాగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,34,016 కోట్లు వచ్చాయి. మంగళవారం కంపెనీ షేర్లు బీఎస్‌ఈలో 1.76 శాతం తగ్గి రూ. 707.90 వద్ద ముగిశాయి.