టాటా సన్స్ చైర్మన్ సంచలన నిర్ణయం: లాభాలు తగ్గడంతో శాలరీ హైక్ త్యాగం

టాటా సన్స్ చైర్మన్ సంచలన నిర్ణయం: లాభాలు తగ్గడంతో శాలరీ హైక్ త్యాగం

టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కార్పొరేట్ ప్రపంచంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆయన తన జీతం పెంపును సున్నితంగా తిరస్కరించారు. టాటా సన్స్ బోర్డు మీటింగ్‌లో భాగంగా జరిగిన నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ సమావేశంలో.. ఈ ఏడాది తనకు ఎలాంటి శాలరీ హైక్ వద్దంటూ స్వయంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. కొత్త బిజినెస్‌లలో లాభాలు తగ్గడం, ఇన్వెస్ట్‌మెంట్లపై ఒత్తిడి పెరుగుతున్న వేళ ఈ డెసిషన్ తీసుకున్నారు.

దేశంలోనే అత్యధిక జీతం తీసుకునే టాప్ బిజినెస్ లీడర్లలో చంద్రశేఖరన్ ఒకరు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.156 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారు. ఇది అంతకుముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం ఎక్కువ. ఈ రూ.156 కోట్లలో బేసిక్ శాలరీ, బెనిఫిట్స్ కలిపి కేవలం రూ.15 కోట్లు మాత్రమే. మిగిలిన రూ.141 కోట్లు కంపెనీ లాభాల ఆధారంగా వచ్చే ప్రాఫిట్-లింక్డ్ కమిషన్. అంటే ఆయన ప్యాకేజీ పూర్తిగా కంపెనీల పర్ఫార్మెన్స్‌పైనే ఆధారపడి ఉంటుంది.

అయితే ప్రస్తుతం టాటా గ్రూప్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. గ్రూప్ ఆదాయం భారీగా పెరుగుతున్నప్పటికీ.. లాభాల విషయంలో మాత్రం కాస్త బ్రేకులు పడ్డాయి. FY25లో టాటా సన్స్ రెవెన్యూ 24% పెరిగి రూ.5లక్షల 92వేల కోట్లకు చేరింది. కానీ నికర లాభం మాత్రం 17% తగ్గి రూ.28వేల 898 కోట్లకు పడిపోయింది. అంతేకాదు ఈ మొత్తం లాభంలో దాదాపు 43% వాటా కేవలం ఒక్క టీసీఎస్ నుంచే వస్తుండటంతో టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఐటీ రంగంపై ఏఐ ప్రభావంతో భవిష్యత్తు ఆదాయాలపై కూడా నీలినీడలు అలుముకుంటున్నాయి.

మరోవైపు, టాటా గ్రూప్ కొత్తగా పెట్టిన నయా-తరం బిజినెస్‌లలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. దీనిపై టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా మొదట్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. దేశ నిర్మాణంలో కీలకమైన 'టాటా ఎలక్ట్రానిక్స్' ఎదుగుదలను ఆయన అభినందించారు. ఈ నేపథ్యంలో, గ్రూప్ లాభాలను సమన్వయం చేస్తూ, కొత్త వ్యాపారాలను లాభాల్లోకి తేవడమే లక్ష్యంగా చంద్రశేఖరన్ ఈ శాలరీ హైక్ త్యాగం చేశారు. లీడర్ అంటే కేవలం లాభాలు పంచుకోవడం కాదు.. కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవడం కూడా అని ఆయన మరోసారి నిరూపించారు.