జీఎం ఆఫీస్ లనే టీబీజీకేఎస్ నేతలు తన్నుకున్నరు

జీఎం ఆఫీస్ లనే టీబీజీకేఎస్ నేతలు తన్నుకున్నరు

గోదావరిఖని,వెలుగు:సింగరేణిలో గుర్తింపు సంఘం, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీకి అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌‌) నాయకులు తన్నుకున్రు. సోమవారం జీఎం ఆఫీస్‌‌లోలనే ఆ యూనియన్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఎదుట ఈ కొట్లాట జరగడం కార్మికుల్ని విస్తుపోయేలా చేస్తున్నది. సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేయాల్సిన కార్మిక నాయకులు కొట్లాటలో ముందున్నరంటూ ముక్కున వేలేసుకుంటున్రు. ఈ గొడవతో టీబీజీకేఎస్‌‌‌‌‌‌లో వర్గపోరు మరోమారు బట్టబయలైంది.

ఈ నెలాఖరున పదవీ విరమణ పొందుతున్న సింగరేణి ఆర్జీ-1 జీఎంగా పనిచేసిన విజయ్‌‌‌‌ పాల్‌‌‌‌ రెడ్డికి టీబీజీకేఎస్‌‌‌‌ సెంట్రల్‌‌‌‌ కమిటీ, రామగుండం రీజియన్‌‌‌‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సన్మానం చేయాలని నిర్ణయించారు. దీనిపై రీజియన్‌‌‌‌ సెక్రటరీ కనకం శ్యాంసన్‌‌‌‌ గని పిట్‌‌‌‌ కార్యదర్శులు, సెంట్రల్‌‌‌‌ కమిటీ నాయకులకు ఫోన్‌‌‌‌ ద్వారా సమాచారమిచ్చారు. అయితే టీబీజీకేఎస్‌‌‌‌ ఆర్జీ -1 ఏరియా కమిటీ  ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌‌‌‌రావు కొంతమంది నాయకులకు ఫోన్‌‌‌‌ చేసి సన్మానానికి వెళ్లవద్దని కోరారు. సాయంత్రం ఎస్‌‌‌‌అండ్‌‌‌‌పీసీ సిబ్బంది ఆధ్వర్యంలో జీఎంను సన్మానించే కార్యక్రమానికి టీబీజీకేఎస్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిని ఆహ్వానించగా, ఆయనతో పాటు ఏరియా ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్‌‌‌‌రావు వచ్చారు. జీఎంను సన్మానం తర్వాత చాంబర్‌‌ నుంచి బయటకు వచ్చాక యూనియన్‌‌ నాయకులకు, దామోదర్‌‌‌‌కు మధ్య మాటామాటా పెరిగింది. రిటైర్‌‌ అయిన శ్యాంసన్‌‌‌‌ జీఎంను ఎలా సన్మానిస్తాడంటూ దామోదర్‌‌‌‌ కొన్ని పరుషమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. దీంతో బేబీ శ్రీనివాస్‌‌‌‌, పెంచాల తిరుపతి  దామోదర్‌‌‌‌పై దాడికి దిగారు.  కిందపడేసి తన్నారు. ఈ సంఘటన యూనియన్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి ఎదుటే జరగడం గమనార్హం. నేతలు వాగ్వాదానికి దిగినప్పుడే రాజిరెడ్డి వారిస్తే పరిస్థితి తన్నుకునే వరకు వెళ్లేది కాదని కార్మికులు అంటున్నారు. సోమవారం రాత్రి గోదావరిఖని వన్‌‌‌‌ టౌన్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్లో రీజియన్‌‌‌‌ కార్యదర్శి కనకం శ్యాంసన్‌‌‌‌, ఏరియా ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్‌‌‌‌ రావు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.

పట్టింపులేని అధి నాయకత్వం…

టీబీజీకేఎస్‌‌‌‌ సెంట్రల్‌‌ ఆఫీస్‌‌ గోదావరిఖనిలోనే కొనసాగుతున్నది. ఇదే కార్యాలయంలో ఆర్జీ-1 ఏరియా యాక్టివిటీస్‌‌ కూడా నడుస్తాయి. యూనియన్‌‌‌‌లో నాయకులు పెరుగుతున్న కొద్ది ఆధినాయకత్వం వారికి వివిధ పదవులు కట్టబెడుతూ వచ్చింది. పదవులు పొందిన వారు తమ ఆధిపత్యం కొనసాగించుకునేందుకు గ్రూపులు కట్టడం స్టార్టైంది. ఇలా వర్గపోరు పెరిగిపోయి దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఆరు నెలల క్రితం యూనియన్‌‌‌‌ సెంట్రల్‌‌ ఆఫీస్‌‌లోనే ఓ గని పిట్‌‌‌‌ కార్యదర్శిపై కూడా కొందరు నాయకులు దాడి చేసి చేశారు. అధినాయకత్వం దీనిపై ఓ కమిటీ వేసి విచారణ జరపాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు ఇందుకు సంబంధించిన చర్యలేమీ తీసుకోలేదు. దాంతో నాయకులు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎవరైనా ముఖ్య నాయకులు వచ్చినప్పుడు, ప్రెస్‌‌‌‌ మీట్లు నిర్వహించినప్పుడు మాత్రం కలిసి ఉన్నట్టుగా నటించేవారు. భౌతిక దాడుల నేపథ్యంలో ఒక దశలో యూనియన్‌‌‌‌లో కీలక బాధ్యతలు నిర్వహించిన వారు ఆఫీస్‌‌ల వైపు రాని పరిస్థితి ఏర్పడింది. చివరకు జీఎం ఆఫీస్‌‌లో యూనియన్‌‌‌‌ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి సమక్షంలోనే ఒక ఏరియాకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నాయకుడిపై దాడి జరగడం ఆ సంఘం నాయకత్వంలో ఏర్పడిన అనైక్యతను, ఆధిపత్య పోరును స్పష్టం చేస్తున్నది. అయితే టీబీజీకేఎస్‌‌‌‌లో కీలక నేతగా కొనసాగిన కెంగెర్ల మల్లయ్య ఆ యూనియన్‌‌‌‌ నుంచి బయటకు వెళ్లే వరకు కలిసి పనిచేసిన యూనియన్‌‌‌‌ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డిలు నేడు ఒకరిపై ఒకరు ఆదిపత్యాన్ని చెలాయించుకునే క్రమంలోనే  ఈ ఘటన జరిగిందనే ప్రచారం కూడా కోల్‌‌‌‌ బెల్ట్‌‌‌‌లో సాగుతున్నది. టీబీజీకేఎస్‌‌ పట్ల కార్మికుల్లో ఆదరణ తగ్గుతోందనే  ప్రచారాల మధ్య యూనియన్‌‌‌‌ నాయకులు తన్నుకోవడంతో గుర్తింపు సంఘం పరిస్థితిని మరింత దిగజార్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.