రెండు గంటల నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుండు

రెండు గంటల నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తుండు

హైదరాబాద్: మున్సిపల్ మంత్రి‌గా కేటీఆర్ విఫలమయ్యారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 7 ఏళ్లుగా హైద్రాబాద్‌లో ఎలాంటి మార్పు రాలేదని ఆయన అన్నారు. ఎల్‌బీ నగర్ పరిధిలో మ్యాన్ హోల్‌లోకి దిగి చనిపోయిన కార్మికుల ఇండ్లకు ఎంపీ రేవంత్ రెడ్డి వెళ్లి.. మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

‘గత ఏడాది వరదలకు హైద్రాబాద్ మునిగింది. వరద బాధితులకు రూ. 10,000 ఇస్తా అని రూ. 600 కోట్లు విడుదల చేశారు. అందులో టీఆర్ఎస్ నాయకులు రూ. 300 కోట్లు దోచుకున్నారు. దళితబంధు తెచ్చామని గొప్పలు చెబుతున్నారు కదా.. మరి దళిత కార్మికులు చనిపోతే.. వారి కుటుంబాలను ఎందుకు పట్టించుకోవడం లేదు. మ్యాన్ హోల్‌లో‌కి మనుషులను దింప కూడదు. అయినా ఇద్దరు కార్మికులను దింపి.. వారి చావుకు కారణమయ్యారు. వారిలో అంతయ్య మృతదేహం ఇంకా దొరకలేదు. ఆ రెండు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం చేశాం. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో పాటు కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాలి. నేను ఇప్పటికే.. జోనల్ కమిషనర్, ఇతర అధికారులతో మాట్లాడాను. ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌కు ఎన్నిసార్లు కాల్ చేసినా స్పందించడం లేదు. పార్లమెంట్ సభ్యుడినైన నేను రెండు గంటల నుంచి కాల్ చేస్తుంటే.. ఆయిన కాల్స్ కట్ చేస్తున్నాడు. నేషనల్ సఫాయి కర్మచారి యాక్ట్ ప్రకారం.. మాన్యువల్‌గా స్కేవెంజింగ్ చేయకూడదు. మరి అలా చేసినందుకు ప్రిన్సిపాల్ సెక్రటరీ అరవింద్ కుమార్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని జాతీయ ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తా. ఇంత పెద్ద ఘటన జరిగినా నగర మేయర్ విజయ లక్ష్మి స్పందించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా.. ఘటన జరిగిన చోటును పరిశీలించి.. బాధిత కుటుంబాలకు భరోసాగా నిలబడాలి’ అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.