ఐటీ ఉద్యోగులకు మంచి జీతాలిస్తూ బాగా చూసుకుంటున్న మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవేనట !

ఐటీ ఉద్యోగులకు మంచి జీతాలిస్తూ బాగా చూసుకుంటున్న మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవేనట !

న్యూఢిల్లీ: మన దేశంలో ఉద్యోగులను ఆకర్షించడంలో టాటా గ్రూప్, గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ కంపెనీలు మొదటిస్థానంలో నిలిచాయని తాజా రిపోర్ట్​ ఒకటి వెల్లడించింది. ఇవి తమ ఉద్యోగులకు మెరుగైన పని వాతావరణం, కెరీర్ వృద్ధి అవకాశాలు, మంచి జీతాలు, ఇతర ప్రయోజనాలను అందించడంలో ముందున్నాయని ర్యాండ్​స్టాడ్ ​ఎంప్లాయర్ ​బ్రాండ్​ రీసెర్చ్​ 2025 రిపోర్ట్​ తెలియజేసింది.

ఈ లిస్టులో శామ్​సంగ్ ఇండియా 4వ స్థానంలో, జేపీ మోర్గన్ చేజ్ 5వ స్థానంలో, ఐబీఎం 6వ స్థానంలో, విప్రో 7వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ 8వ స్థానంలో, డెల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 9వ స్థానంలో, ఎస్​బీఐ పదో 10వ స్థానంలో నిలిచాయి.  ఈ స్టడీ రిపోర్ట్​ను 34 మార్కెట్లలోని 1.70 లక్షల మందికి పైగా రెస్పాండెంట్ల (భారతదేశంలో 3,500 మందికి పైగా) నుంచి సేకరించిన వివరాల ఆధారంగా తయారు చేశారు. నేటి ఉద్యోగులు కేవలం జీతం కాకుండా, అంతకు మించి చాలా ఆశిస్తున్నారని,  వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశం ఇచ్చే కంపెనీలను కోరుకుంటున్నారని ర్యాండ్​స్టాడ్​ తెలిపింది.

టాటా గ్రూప్: భారతదేశంలో అత్యంత విలువైన బ్రాండ్​గా టాటా గ్రూప్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తయారీ, ఆర్థిక సేవలు, వినోదం, వైద్యం, ఆతిథ్యం వంటి వివిధ రంగాలలో విస్తరించి ఉన్న ఈ సంస్థ, ఉద్యోగులను బాగా చూసుకుంటుందనే పేరు సంపాదించుకుంది. డిజిటలైజేషన్, ఈ-–కామర్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్లు, ఏఐ,  పునరుత్పాదక రంగాలపై దృష్టి సారించి, దేశంలో వేగంగా విస్తరిస్తోంది. టాటా గ్రూప్​లో   సుమారు 10,28,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు.

గూగుల్ ఇండియా: టెక్ కంపెనీ గూగుల్ ఇండియా, ఉద్యోగులకు ఆకర్షణీయమైన సంస్థలలో ఒకటిగా నిలిచింది. మెరుగైన పని-జీవిత సమతుల్యత, ఇన్నోవేషన్లను ప్రోత్సహించే వాతావరణం,  ఉద్యోగులకు అందించే విస్తృతమైన ప్రయోజనాలతో గూగుల్ ఉద్యోగులను ఆకర్షిస్తోంది. గూగుల్ మాతృ సంస్థ అయిన ఆల్ఫాబెట్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2023 చివరి నాటికి సుమారు 182,502 అని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఇన్ఫోసిస్: ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కూడా భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన కంపెనీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

ఇది ఉద్యోగులకు కెరీర్ అభివృద్ధికి అవకాశాలు, శిక్షణ కార్యక్రమాలు, భారీ జీతాలను అందిస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి కంపెనీకి 3,23,578 మంది ఉద్యోగులు ఉన్నారు.  కంపెనీల ఆర్థిక పనితీరు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, ఆవిష్కరణలు, ఇతర అంశాల ఆధారంగా ఈ రిపోర్ట్​ను తయారు చేశామని ర్యాండ్​స్టాడ్​ తెలిపింది. భారతదేశంలో తయారీ, ఐటీ, కమ్యూనికేషన్, టెలికాం, ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ-కామర్స్ బ్యాంకింగ్ వంటి రంగాలు ఉద్యోగులకు అత్యంత ఆకర్షణీయంగా మారాయని వెల్లడించింది.