హైదరాబాద్ కట్టింది నేను కాదు : చంద్రబాబు

హైదరాబాద్ కట్టింది నేను కాదు  : చంద్రబాబు

దేశంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందంటే అందుకు కారణం టీడీపీ అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్ను తాను నిర్మించలేదని, అలా ఎప్పుడూ చెప్పుకోలేదని అన్నారు. అయితే సైబరాబాద్ కు పునాదులు వేసింది మాత్రం తానేనని చెప్పారు. హైదారాబాద్ లో ఐటీ అభివృద్ధికి నాంది పలికింది టీడీపీ పార్టీ కాదా అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయం చేసే రైతు బిడ్డ నాగలితో పాటు మౌస్ పట్టుకోవాలని తానే చెప్పానని అన్నారు. తెలంగాణలో ఇరిగేషన్ అభివృద్ధికి తామే శ్రీకారం చుట్టామన్న చంద్రబాబు.. ఎస్సారెస్పీ, దేవాదుల కల్వకుర్తి ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే ప్రారంభించినట్లు చెప్పారు. 

రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చిన ఎన్టీఆర్

వెనుకబడిన వర్గాలకు టీడీపీ సరైన వేదిక అని చంద్రబాబు అన్నారు. ఆర్థిక అసమానతలు తొలగి.. పేదరికం పోయేంత వరకు టీడీపీ పనిచేస్తూనే ఉంటుందన్నారు. ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీలు రాజకీయాలకు కొత్త నిర్వచనం ఇచ్చాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారన్న ఆయన.. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన నేత ఎన్టీఆర్ అని చెప్పారు. పరిపాలనను పేదోడి ఇంటి ముందుకు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. 

పూర్వవైభవానికి కృషి 

తెలంగాణలో టీడీపీ పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు అందరూ కృషి చేయాలని నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పేదల పార్టీ అయిన టీడీపీ పుట్టింది తెలంగాణ గడ్డపైనే అని అన్నారు. తెలుగు జాతి ఉన్నంత కాలం టీడీపీ ఉంటుందన్న ఆయన.. అతి తక్కువ సమయంలోనే అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగు దేశం అని గుర్తు చేశారు. పటేల్, పట్వారీ విధానం రద్దు చేసిన తర్వాతే తెలంగాణకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని చంద్రబాబు చెప్పారు. పేదల అభివృద్ధి కోరుకుంటున్న ప్రతీ ఒక్కరూ తెలుగుదేశంతో చేతులు కలపాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.