పతనావస్థలో తెలుగుదేశం పార్టీ

పతనావస్థలో తెలుగుదేశం పార్టీ
  • టీడీపీకి గడ్డుకాలం
  • చరిత్రలో తొలి సారి మహానాడు రద్దు

హైదరాబాద్, వెలుగు: టీడీపీ.. గతమెంతో ఘనం.ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగింది. కానీ ఓడలు బండ్లయ్యాయి . రాష్ర్టంలో టీడీపీ పతనమైంది. ఏపీలో అధికారంలో ఉండటంతో ఇక్కడ పార్టీ బాగానే నడిచింది. కానీ ఏపీ ఎన్నికల్లో దారుణ ఓటమి మూటగట్టుకోవడంతో పరిస్థితి పూర్తిగా దిగజారింది.

మెల్లగా కనుమరుగు!

2014 నుంచి రాష్ర్టంలో టీడీపీ పతనం కొనసాగుతోంది. గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో13 చోట్ల పోటీ చేసి రెండు సీట్లలో మాత్రమే ఆ పార్టీ గెలిచింది. ఇందులో సండ్ర వెంకటవీరయ్య అధికార పార్టీలో చేరారు. మిగిలిన ఒక్క ఎమ్మెల్యే కూడా త్వరలో అధికార పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో అధికారంలో ఉండటంతో గత ఐదేళ్లు టీటీడీపీ ఆర్థికంగా నిలదొక్కుకుం ది. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్ రమణ, ఎంపీ గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపీ దేవేందర్ గౌడ్, సీనియర్ నేతలు రావుల చంద్ర శేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్ తదితర కొందరు నేతలు పార్టీలో ఉన్నారు. ఐదేళ్ల తర్వాత వీరిలో ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎందరు అధికార పార్టీలోకి వెళ్తారో అని ఇప్పుడే గుసగుసలు వినిపిస్తున్నాయి .

తొలిసారి మహానాడు రద్దు

1982లో టీడీపీని స్థాపించిన నాటి నుంచి ఏటా మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మూడు రోజులపాటు పండుగలా మహానాడు నిర్వహిస్తున్నారు.అయితే తొలిసారిగా ఈ ఏడాది మహానాడును రద్దు చేస్తున్నట్లు చంద్ర బాబు ప్రకటించారు. ఏపీలో ఓడిపోవడంతో రాష్ర్ట  పార్టీ భవిష్యత్‌ పై అనుమానాలు నెలకొన్నాయి . ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవిని ఇతర నేతలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.