పరిస్థితిని బట్టి పోటీ స్థానాలు నిర్ణయిస్తాం : చంద్రబాబు

పరిస్థితిని బట్టి పోటీ స్థానాలు నిర్ణయిస్తాం : చంద్రబాబు

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రజల్లో పార్టీపై గుడ్​విల్ ఉందని, దాన్ని ఓటు బ్యాంకుగా మారిస్తే సరిపోతదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. జీ–20 సన్నాహక సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన మంగళవారం మీడియాతో చిట్​చాట్​ చేశారు. 2009 ఎన్నికల్లో పొత్తులో భాగంగా టీఆర్ఎస్ కు 44 సీట్లు ఇస్తే, ఆ పార్టీ సక్సెస్ రేటు 20 శాతమని, టీడీపీ సక్సెస్ రేటు 70 శాతంగా నమోదైందన్నారు. అలాగే, 2014 లో దాదాపు 40కి పైగా బీజేపీకి సీట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఇందులో బీజేపీ 5స్థానాల్లోనే గెలిచిందన్నారు. దాదాపు 50 స్థానాల్లో టీడీపీ విజయం సాధించిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి కోర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా తెలంగాణలో టీడీపీ, క్యాడర్ వీక్​ అయ్యిందని చెప్పారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనేది పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని వివరించారు. షర్మిల పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘కొత్త ఐడియా ఇస్తున్నారు. షర్మిల పార్టీతో పొత్తుపెట్టుకోవడం అంటే.. ఆత్మహత్య సదృశ్యమే. అసలు ఆ పార్టీకి తెలంగాణలో ఓటు బ్యాంక్ ఎక్కడుంది? టీడీపీకి పూర్తి స్థాయిలో బలమైన ఓటర్లు ఉన్నారు”అని చంద్రబాబు అన్నారు. 

త్వరలో ఖమ్మంలో సభ

పార్టీని క్యాడర్ ను బలోపేతం చేయడం, ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని తిరిగి టీడీపీ గూటికి చేర్చే దిశగా చంద్రబాబు ప్లాన్​ చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జ్ఞానేశ్వర్ నేతృత్వంలో త్వరలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారు. జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. 

షర్మిలతో పోలీసుల తీరు బాధాకరం

వైఎస్​ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలతో పోలీసులు వ్యవహరించిన తీరును చంద్రబాబు నాయుడు తప్పుబట్టారు. ఒక మహిళ అని చూడకుండా చాలా దారుణంగా వ్యవహరించారని విమర్శించారు. ప్రధాని, జగన్ మధ్య షర్మిల ప్రస్తావన వచ్చిందని చెప్పారు. ఇంత జరిగినా చెల్లితో జగన్ మాట్లాడలేదన్నారు. ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారని గుర్తు చేశారు.