నిన్న గుడివాడ.. నేడు గన్నవరం: నియోజకవర్గాలు మారలేకే పార్టీ మారా

నిన్న గుడివాడ.. నేడు గన్నవరం: నియోజకవర్గాలు మారలేకే పార్టీ మారా
  • తెలుగు దేశం పార్టీకి కృష్ణా జిల్లాలో మరో షాక్
  • సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన దేవినేని అవినాశ్
  • టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా చేరిక

తెలుగు దేశం పార్టీకి గట్టి పట్టున్న కృష్ణా జిల్లాలో మరో షాక్ తగిలింది. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా.. గురువారం మరో కీలక యువనేత టీడీపీకి గుడ్‌బై చెప్పారు. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి, తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన లేఖను కేంద్ర కార్యాలయాన్ని పంపించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అధికార పార్టీలో చేరారు.  ఆయనతో పాటు టీడీపీ సీనియర్ నేత కడియాల బుచ్చిబాబు కూడా వైసీపీలోకి మారారు. వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత దేవినేని అవినాశ్ మీడియాతో మాట్లాడారు.

కార్యకర్తల్ని పట్టించుకోకనే..

టీడీపీ అధినేత చంద్రబాబు తన కార్యకర్తల్ని, నేతల్ని పట్టించుకోకపోవడం వల్లే పార్టీ మారాల్సి వచ్చిందని దేవినేని అవినాశ్ చెప్పారు. ఒక వ్యక్తి నాయకుడిగా ఎదిగారంటే కారణం వెనుక అండగా నిలబడిన కార్యకర్తల శ్రమేనని ఆయన అన్నారు. “మన వ్యక్తిగత జీవితాల కన్నా, మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు  ముఖ్యం.. వారి శ్రేయస్సు కోసం మనం  ఎలాంటి అడుగు అయినా తీసుకోకతప్పదు ” అని తన తండ్రి దేవినేని నెహ్రూ చెప్పేవారని అవినాశ్ తెలిపారు. ఎన్నికలకు ముందు తనను గుడివాడ నియోజకవర్గానికి మార్చారని, అది తనకు అనుకూలమైన నియోజకవర్గం కాకపోయినా వెళ్లానని చెప్పారాయన. ఇప్పుడు మళ్లీ గన్నవరం ఇన్‌చార్జిగా ఉండాలని టీడీపీ నాయకత్వం ఆదేశించిందన్నారు. ఇలా రోజుకో నియోజకవర్గం మారిస్తే కార్యకర్తల్ని కూడా తన వెంట ఎలా మార్చుకోగలనని ప్రశ్నించారాయన. ఒక నియోజకవర్గంలో బలపడుతున్నప్పుడల్లా మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నిర్ణయాలతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని, అందుకే వారితో చర్చించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నానని దేవినేని అవినాశ్ చెప్పారు. అయితే చంద్రబాబుపై తనకున్న గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని అన్నారాయన.