
ఆంధ్ర ప్రదేశ్ లో ఐదునెలలుగా రాక్షస పాలన నడుస్తుందన్నారు టీడీపీ నాయకులు, ఎంపీ కేశినేని నాని. ప్రతిపక్ష నేతలను వేధించడమే సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారన్నారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఎందువల్ల చనిపోయారో అందరూ చూశారని అన్నారు. డిస్ట్రిక్షన్ తో ప్రజావేదికను కూలగొట్టి జగన్ పాలన ప్రారంభించారని చెప్పారు. రాజకీయం, రాక్షసత్వం ప్రస్తుతం ఆంధ్రాలో నడుస్తుందని అన్నారు. ఆంధ్రా వాళ్లు ఎంతో మంది మేధావులుగా విదేశాలలో ఖ్యాతి గడించారని… అలాంటి వారిని తయారు చేసిన అధ్యాపకులను అక్రమంగా అరెస్టు చేయిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
జగన్ ప్రభుత్వం లో జరుగుతున్న అరాచకాలను ఆధారాలతో సహా గవర్నర్ కు వివరించామని అన్నారు నాని. నిజాయితీ గల అధికారులు, అధ్యాపకుల పై తప్పుడు కేసులు పెడుతున్నారని అన్నారు. జగన్ ప్రభుత్వం నేడు సిగ్గు తో తల దించుకోవాలని… వీసీపై కేసు ఉద్దేశ పూర్వకంగా పెట్టిందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఘోరాలు, నేరాలను జగన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు.
జగన్ పనుల వల్ల ఏపి ప్రజలు అన్ని విధాలా నష్టపోతున్నారని అన్నారు నాని. రాష్ట్రం వెనక్కి వెళ్లిపోతుందని చెప్పారు. అన్ని విషయాలపై విచారణ చేపిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు. నేడు విద్యా వ్యవస్థ ను విచ్చిన్నం చేసేలా జగన్ వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసమా, తన కేసుల కోసమా ఢిల్లీ పర్యటన అనేది జగన్ కే తెలియాలని చెప్పారు. టిడిపి హయాంలో జరిగిన కట్టడాలను కూల్చడం మినహా జగన్ చేపట్టిన నిర్మాణాలు ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు.