నారాయణ కాలేజీలో షాకింగ్ ఘటన: దవడ ఎముక విరిగేలా స్టూడెంట్‎పై దాడి

నారాయణ కాలేజీలో షాకింగ్ ఘటన: దవడ ఎముక విరిగేలా స్టూడెంట్‎పై దాడి

మలక్ పేట, వెలుగు: ఓ విద్యార్థిపై కాలేజీ ఫ్లోర్​ఇన్​చార్జి దారుణంగా దాడి చేశాడు. దిల్ సుఖ్ నగర్ గడ్డిఅన్నారం నారాయణ జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. బాధిత విద్యార్థి కుటుంబసభ్యులు తెలిపిన ప్రకారం.. అల్మాస్ గుడా ప్రాంతానికి చెందిన దొంతిక సంతోష్ కుమార్ కొడుకు సాయి పునీత్ దిల్ సుఖ్ నగర్ గడ్డి అన్నారం నారాయణ జూనియర్ కాలేజీలో ఎంపీసీ ఫస్టియర్​ చదువుతున్నాడు. 

ఈ నెల 15న ఇద్దరు స్టూడెంట్ల మధ్య వాగ్వాదం జరగ్గా, ఫ్లోర్ ఇన్​చార్జ్ మాలి సతీష్ జోక్యం చేసుకొని సాయి పునీత్‎ను కొట్టాడు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో సాయి పునీత్ ఎడమ దవడ ఎముక విరిగిపోయింది. ఇంత జరిగినా కాలేజీ యాజమాన్యం  పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు బాధిత స్టూడెంట్​ తల్లిదండ్రులు మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ పిడమర్తి నరేశ్​ తెలిపారు.